Team India arrive in UAE: యూఏఈలో అడుగుపెట్టిన టీమిండియా
క్రికెట్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ కి కౌంట్ డౌన్ మొదలయింది. మరో నాలుగు రోజుల్లో ఈ టోర్నీ షురూ కానుంది.
- By Naresh Kumar Published Date - 05:03 PM, Tue - 23 August 22

క్రికెట్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ కి కౌంట్ డౌన్ మొదలయింది. మరో నాలుగు రోజుల్లో ఈ టోర్నీ షురూ కానుంది. టోర్నీలో ఆడే జట్లు ఒక్కొక్కటిగా ఎడారి దేశం చేరుకుంటున్నాయి. తాజాగా భారత క్రికెట్ జట్టు యూఏఈలో అడుగుపెట్టింది. రోహిత్ శర్మ నేతృత్వంలో కోహ్లి, పంత్, అశ్విన్ సహా ఇతర ఆటగాళ్లు దుబాయ్ చేరుకున్నారు. విండీస్ , జింబాబ్వే టూర్ల నుంచి రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లి.. తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికాతో దర్శనమివ్వడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కోహ్లి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా కాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న కోహ్లీ ఆసియా కప్ తోనైనా సత్తా చాటాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఆసియా కప్‌లో కోహ్లికి మంచి రికార్డు ఉంది.
కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసి వెయ్యి రోజులు దాటిపోగా…టీ ట్వంటీ వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో విరాట్ ఫామ్ అందుకోవడం టీమిండియాకు చాలా కీలకమని చెప్పొచ్చు. కాగా జింబాబ్వే టూర్ ముగించుకున్న భారత జట్టులో మరికొందరు ఆటగాళ్ళు నేరుగా దుబాయ్ రానున్నారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కరోనా కారణంగా స్వదేశంలోనే ఆగిపోయాడు. దీంతో వీవీఎస్ లక్ష్మణ్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే
ఆగస్టు 27న శ్రీలంక, అఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ ద్వారా 15వ ఆసియాకప్‌కు తెరలేనుంది. ఇక ఆగస్టు 28 న టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో హైవోల్టేజ్ మ్యాచ్‌లో తలపడనుంది.