Asian Games 2023: మా టార్గెట్ గోల్డ్ మెడల్ టీమిండియా కొత్త సారథి రుతురాజ్
టీమిండియా క్రికెటర్లందరూ ఏడాది చివరి వరకూ బిజీబిజీగా గడపనున్నారు. ఒకవైపు ఆసియాకప్ , తర్వాత వన్డే వరల్డ్ కప్ , ఆ లోపు ఆసియా క్రీడలు ఇలా తీరికలేని షెడ్యూల్ ఎదురుచూస్తోంది
- Author : Praveen Aluthuru
Date : 15-07-2023 - 10:56 IST
Published By : Hashtagu Telugu Desk
Asian Games 2023: టీమిండియా క్రికెటర్లందరూ ఏడాది చివరి వరకూ బిజీబిజీగా గడపనున్నారు. ఒకవైపు ఆసియాకప్ , తర్వాత వన్డే వరల్డ్ కప్ , ఆ లోపు ఆసియా క్రీడలు ఇలా తీరికలేని షెడ్యూల్ ఎదురుచూస్తోంది. వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఆసియాక్రీడల కోసం బీసీసీఐ యువ క్రికెటర్లతో కూడిన జట్టును పంపిస్తోంది. ఇప్పటికే ఎంపిక చేసిన భారత జట్టును రుతురాజ్ గైక్వాడ్ లీడ్ చేయనున్నాడు. తొలిసారి జాతీయ జట్టు కెప్టెన్ గా ఒక మెగా ఈవెంట్ లో ఆడనుండడంపై రుతురాజ్ స్పందించాడు. ఇది తనకు అద్భుతమైన అవకాశంగానూ, గౌరవంగానూ అభివర్ణించాడు. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐకి రుతురాజ్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతిష్టాత్మక ఆసియాక్రీడల్లో భారత జట్టుకు సారథ్యం వహించనుండడం గర్వంగా ఉందన్నాడు. తనతో పాటు జట్టులోని ఇతర సభ్యులు కూడా ఈ మెగా ఈవెంట్ లో ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పాడు.
ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలవడమే తమ లక్ష్యమని తెలిపాడు. గోల్డ్ మెడల్ ధరించి పోడియంపై భారత జెండా రెపరెపలాడుతుండగా జాతీయ గీతాన్ని ఆలపించే అరుదైన అవకాశాన్ని చేజార్చుకోమని ఉద్వేగంగా చెప్పాడు. చైనాలో జరగనున్న ఆసియా క్రీడల కోసం బీసీసీఐ పురుషుల, మహిళల జట్లను పంపిస్తోంది. అయితే అక్టోబర్ లో వన్డే ప్రపంచకప్ ఉండడంతో ఐపీఎల్ లో సత్తా చాటిన పలువురు యువక్రికెటర్లను ఆసియా క్రీడల్లో ఆడే జట్టుకు ఎంపిక చేసింది. ఈ సీజన్ లో అదరగొట్టిన తిలక్ వర్మ , రింకూ సింగ్ , యశస్వి జైశ్వాల్ , అర్ష్ దీప్ సింగ్ వంటి యువక్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 28 నుండి చైనా హ్యాంగ్ జౌ వేదికగా ఆరంభం కానున్నాయి. కాగా సీడెడ్ జాబితా ప్రకారం టీమిండియా నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. అటు మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది.
ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).
స్టాండ్‌బై ప్లేయర్లు:
యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.
Read More: Wimbledon 2023: వింబుల్డన్ విజేత్ వొండ్రుసోవా