World Cup 2023: పసికూన కాదు.. భారత బౌలింగ్ మెరుగుపడాల్సిందే..
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. అయితే ఇదేమి చిన్న స్కోర్ కాదు.
- By Praveen Aluthuru Published Date - 12:12 PM, Thu - 12 October 23

World Cup 2023: భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. అయితే ఇదేమి చిన్న స్కోర్ కాదు. పసికూన కదా తక్కువ స్కోరుకు చుట్టేయొచ్చని టీమిండియా వ్యూహకర్తలు భావించి ఉంటారు. కానీ వాస్తవానికి జరిగింది వేరు. ఆ జట్టు ఆట చూస్తే ఏ మూలానా చిన్న జట్టుగా ప్రొజెక్ట్ కాలేదు. నిజం చెప్పాలంటే ఆఫ్ఘన్ బ్యాటర్లు టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. కెప్టెన్ హష్మదుల్లా షాహిది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఫ్ఘన్ జట్టు 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా… షాహిది, అజ్మతుల్లాతో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. షాహిది 88 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 89 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అజ్మతుల్లా 69 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు, 4 సిక్సులున్నాయి.
ఇక్కడ మ్యాచ్ స్థితిని గమనిస్తే భారత బౌలర్లపై ఆఫ్ఘన్ బ్యాటర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. షాహిది మరియు అజ్మతుల్లా జోడీని విడగొట్టడానికి టీమిండియా బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఈ జోడీ భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టించింది. మూడు వికెట్లు చేజార్చుకున్న ఆఫ్ఘన్ , నాలుగో వికెట్ కు అమూల్యమైన 121 పరుగులు జోడించింది. ఇదేమి ఆషామాషీ భాగస్వామ్యం కాదంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఈ విషయంలో భారత బౌలింగ్ ఎంత వీక్ గా ఉందో మరోసారి బయటపడిందని జాగ్రత్త వహించమని సలహా ఇస్తున్నారు.
13వ ఓవర్ నుంచి 34వ ఓవర్ దాకా ఈ జోడీని విడగొట్టలేకపోయారు టీమిండియా బౌలర్లు. పసికూనగా తీసిపడేసే ఆఫ్గనిస్తాన్ జట్టు బలమైన భారత జట్టుపై 272 పరుగులు చేయడం నిజంగా వాళ్ళని అభినందించాల్సిందే. ఇక్కడ టీమిండియాని తక్కువగా చేసి చూడట్లేదు. మునుముందు టీమిండియా మరింత పటిష్టమైన ఆటగాళ్లతో పోటీ పడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సోతాఫ్రికా లాంటి గట్టి పోటీనిచ్చే టీమ్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొన్న తొలిమ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలిచాం కదా అనుకుంటే సరిపోదు. ఫ్యూచర్ మ్యాచెస్ లో ఆసీస్ మరింత పటిష్టంగా మారనుంది. వరల్డ్ క్లాస్ బౌలింగ్ లైనప్ ఉన్న టీమిండియా ఆఫ్గాన్ జట్టును 50 ఓవర్లు ఆడించిందంటే మన బౌలర్లు మరింత కష్టపడాల్సి ఉంది. ఇక భారత బౌలింగ్ విషయానికి వస్తే పేసర్ బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ జోరుకు కళ్లెం వేశాడు. ఇన్నింగ్స్ లో బుమ్రా 4 వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 2, శార్దూల్ ఠాకూర్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసుకున్నారు.
Also Read: World Cup 2023: రోహిత్.. చూసుకోవాలి కదా