World Cup: ఆడుతూ పాడుతూ… పాక్‌ను చిత్తు చేసిన భారత్
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. హైవోల్టేజ్ మ్యాచ్‌లో రోహిత్‌సేన పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది.
- By Naresh Kumar Published Date - 08:49 PM, Sat - 14 October 23

World Cup: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. హైవోల్టేజ్ మ్యాచ్‌లో రోహిత్‌సేన పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో కంప్లీట్ డామినేషన్‌తో అదరగొట్టిన భారత్ ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. పాక్‌పై ప్రపంచకప్‌లో అజేయమైన రికార్డును కొనసాగిస్తూ ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది.
శుభ్‌మన్‌గిల్ డెంగ్యూ నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి రావడంతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆరంభంలో పాక్ ధాటిగానే ఆడింది. ఓపెనర్లు నిలకడగా ఆడి తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. అయితే పేసర్లు వరుసగా వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచారు. షఫీక్ 20, ఇమాముల్ హక్ 36 రన్స్‌కు వెనుదిరిగారు. ఈ దశలో కెప్టెన్ బాబర్ అజాం , రిజ్వాన్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. బాబర్ అజాం 50 పరుగులు చేయగా.. రిజ్వాన్ 49 రన్స్‌కు ఔటయ్యారు. సిరాజ్, బూమ్రా వీరిద్దరినీ పెవిలియన్‌కు పంపించారు.
తర్వాత స్పిన్నర్ల రాకతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పేశాడు. ఇఫ్తికర్ అహ్మద్, షకీల్‌లను ఔట్ చేశాడు. ఇక్కడ నుండి పాక్ మళ్లీ కోలుకోలేకపోయింది. అటు జడేజా, పాండ్యా కూడా చెలరేగడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కు 191 పరుగులకు తెరపడింది. భారత బౌలర్లలో అందరూ కలిసికట్టుగా రాణించారు. బూమ్రా, సిరాజ్, పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. పాక్ చివరి ఆరు వికెట్లను 31 పరుగుల తేడాలో చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉండడంతో పాక్ బ్యాటర్లు భారీ షాట్లు కొట్టలేకపోయారు.
192 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 23 పరుగులకే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వికెట్ చేజార్చుకుంది. గిల్ 11 బంతుల్లో 4 ఫోర్లతో 16 రన్స్ చేసి ఔటవగా… కోహ్లీ కూడా 16 పరుగులకే వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ రోహిత్‌శర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి 77 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. తన ఫామ్ కొనసాగిస్తూ పాక్ బౌలర్లపై రోహిత్ ఆధిపత్యం కనబరిచాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరింత దూకుడుగా ఆడే క్రమంలో మూడో వికెట్‌కు ఔటయ్యాడు. రోహిత్ శర్మ 63 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేశాడు.
తర్వాత శ్రేయాస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. కెఎల్ రాహుల్‌తో కలిసి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. ఫలితంగా భారత్ 30.3 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్‌కు దూసుకెళ్ళింది. పాక్ బౌలర్లు భారత బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. మొత్తం మీద పాక్‌పై ప్రపంచకప్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తర్వాతి మ్యాచ్‌లో భారత్ అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
That tiny moment before the ball disappears into the stands! 👌 👌
Rohit Sharma + Pull Shot = 🔥
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/bYW5Wwk82M
— BCCI (@BCCI) October 14, 2023