Shikhar: సౌతాఫ్రికా బయలుదేరిన వన్డే జట్టు ఆటగాళ్ళు
భారత్, సౌతాఫ్రికా మధ్య ఒకవైపు మూడో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. మరోవైపు వన్డే సిరీస్ కోసం భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే స్వదేశంలో క్వారంటైన్ , ఫిట్ నెస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 9 మంది క్రికెటర్లు ఇవాళ ముంబై నుండి కేప్ టౌన్ బయలుదేరారు.
- By Hashtag U Published Date - 11:13 AM, Wed - 12 January 22

భారత్, సౌతాఫ్రికా మధ్య ఒకవైపు మూడో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. మరోవైపు వన్డే సిరీస్ కోసం భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే స్వదేశంలో క్వారంటైన్ , ఫిట్ నెస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 9 మంది క్రికెటర్లు ఇవాళ ముంబై నుండి కేప్ టౌన్ బయలుదేరారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వీరంతా సఫారీ గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్, బౌలర్లు భువనేశ్వర్ కుమార్, చాహల్, ఇషాన్ కిషన్ , ప్రసిద్ధ కృష్ణ , ఇంకా సహాయక సిబ్బంది కేప్ టౌన్ బయలుదేరిన వారిలో ఉన్నారు. అయితే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో చివరి నిమిషంలో సఫారీ టూర్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో జయంత్ యాదవ్ ను ఎంపిక చేశారు. జయంత్ యాదవ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే టెస్ట్ జట్టుతో పాటు ఉన్నాడు.
ఇదిలా ఉంటే సౌతాఫ్రికా చేరుకోగానే ఆటగాళ్ళందరూ మూడు రోజులు క్వారంటైన్ లో ఉండనున్నారు. క్వారంటైన్ ముగిసిన తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. అలాగే ప్రతీరోజూ వీరందరికీ కోవిడ్ టెస్టులు చేయనుండగా.. పాజిటివ్ వస్తే సిరీస్ మొత్తానికీ దూరం కానున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేవ్ నేపథ్యంలో సౌతాఫ్రికాలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే వన్డే సిరీస్ జనవరి 19 నుండి ప్రారంభం కానుంది. కరోనా ఆంక్షల కారణంగా వన్డే సిరీస్ కు కూడా ప్రేక్షకులను అనుమతించకూడదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయించింది.