World Badminton Championship: సాత్విక్-చిరాగ్ షెట్టి జోడీకి మెడల్
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడీ చిరాగ్ షెట్టి, సాత్విక్ సాయిరాజ్ చరిత్ర సృష్టించింది.
- By Naresh Kumar Published Date - 01:07 PM, Fri - 26 August 22

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడీ చిరాగ్ షెట్టి, సాత్విక్ సాయిరాజ్ చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో తొలిసారి మెడల్ గెలిచిన భారత జోడీగా రికార్డులకెక్కింది. క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ ఛాంపియన్స్ జపాన్‌కు చెందిన హోకి,కొబయాషిపై సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా సాగినపోరులో తొలి గేమ్‌ను సాత్విక్ జోడీ గెలుచుకోగా… రెండో గేమ్‌లో మాత్రం జపాన్ జంట పుంజుకుని స్కోర్ సమం చేసింది. అయితే మూడో గేమ్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని ఇండియన్ పెయిర్ 21-14తో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీఫైనల్ చేరడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని సాత్విక్-చిరాగ్ జోడీ ఖాయం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు నిరాశే మిగిలింది. పతకంపై ఆశలు రేకత్తించిన హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో పోరాడి ఓడాడు.
చైనాకు చెందిన జున్ పెంగ్ చేతిలో ప్రణయ్ పరాజయం పాలయ్యాడు.తొలి గేమ్ గెలిచిన ప్రణయ్ తర్వాత అనూహ్యంగా తడబడ్డాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోవడంతో చైనా ప్లేయర్ 21-6తో గెలిచి స్కోర్ సమం చేశాడు. ఇక మ్యాచ్ డిసైడర్‌లో మాత్రం ప్రణయ్ గట్టిపోటీనిచ్చినప్పటకీ…కీలక సమయంలో ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో ఆధిక్యం సాధించిన చైనా ప్లేయర్ మ్యాచ్ గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఇక మరో జోడీ అర్జున్, కపిల కూడా క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. దీంతో ఈ సారి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఒకే ఒక మెడల్ సాధించింది. మహిళల సింగిల్స్‌లో సింధు గాయంతో తప్పుకోగా… సైనా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది.