Sania Mirza: హైదరాబాద్ లో సానియా ఫేర్ వెల్ మ్యాచ్
ఇటీవలే ప్రొఫెషనల్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సొంతగడ్డపై ఫేర్ వెల్ మ్యాచ్ ఆడనుంది. ఎల్బీ స్టేడియం వేదికగా ఆదివారం ఈ మ్యాచ్
- Author : Maheswara Rao Nadella
Date : 04-03-2023 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవలే ప్రొఫెషనల్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) సొంతగడ్డపై ఫేర్ వెల్ మ్యాచ్ ఆడనుంది. ఎల్బీ స్టేడియం వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. అభిమానుల కోసమే హోంటౌన్ లో చివరి మ్యాచ్ ఆడుతున్నట్టు సానియా చెప్పింది. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన సానియా చివరగా దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఆడింది. ఆ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన సానియా కెరీర్‌కు వీడ్కోలు పలికింది. హైదరాబాద్‌లోనే కెరీర్‌ను ప్రారంభించిన సానియా దేశం తరపున మహిళల టెన్నిస్‌లో పలు రికార్డులు అందుకుంది.
ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభిమానుల కోసం రేపు చివరి మ్యాచ్ ఆడుతున్నాననీ, 20 ఏళ్ల క్రితం తాను ఎక్కడ టెన్నిస్ ప్రాక్టీస్ చేసానో అక్కడే ఆఖరి మ్యాచ్ ఆడునుండడం సంతోషంగా ఉందని తెలిపింది. ఈ మ్యాచ్ చూసేందుకు తన కుటుంబం, స్నేహితులు ఇంకా చాలా మంది వస్తున్నారని వెల్లడించింది. విజయంతో కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నానని సానియా (Sania Mirza) వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే భవిష్యత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సానియా చెప్పింది. తన కుమారుడు, కుటుంబంతో సమయం గడుపుతానని, అకాడమీలోనూ సమయం వెచ్చిస్తానని ఈ టెన్నిస్ దిగ్గజం చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే ఎల్బీ స్టేడియంలో ఆదివారం సానియా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. సానియా, రోహన్ బోపన్న టీమ్స్ తలపడనున్నాయి. డబుల్స్‌లో సానియా – బోపన్న జోడీ ఇవాన్ డోడిగ్ – మ్యాటెక్ సాండ్స్ జంటను ఢీ కొట్టనుంది. సానియా చివరి సారి ఆడనున్న ఈ రెండు మ్యాచ్‌లు చూసేందుకు బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు రానున్నట్టు తెలుస్తోంది. 20 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్‌లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ సాధించింది. 91 వారాలు డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించింది.
Also Read: Electric Scooter: దేశంలో ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!