KKR Beat RR: రియాన్ పోరాటం వృథా.. 1 పరుగు తేడాతో విజయం సాధించిన కేకేఆర్!
కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్‌ను ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 1 రన్ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేసి 206 పరుగులు చేసింది. దానికి బదులుగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేయగలిగింది.
- By Gopichand Published Date - 07:44 PM, Sun - 4 May 25

KKR Beat RR: కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్‌ను (KKR Beat RR) ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 1 రన్ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేసి 206 పరుగులు చేసింది. దానికి బదులుగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ పోరులో రియాన్ పరాగ్ 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. దీంతో KKR తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
రాజస్థాన్ రాయల్స్‌కు 207 పరుగుల లక్ష్యం లభించింది. కానీ జట్టు ప్రారంభం చాలా దారుణంగా ఉంది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 4 పరుగులు మాత్రమే చేయగా, ఐపీఎల్ అరంగేట్రం చేసిన కునాల్ సింగ్ రాఠోడ్ తన మొదటి మ్యాచ్‌లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. రాజస్థాన్ 8 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ మంచి ప్రారంభం అందుకున్నాడు. కానీ 21 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు.
ధ్రువ్ జురెల్, వనిందు హసరంగా కూడా బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా సగం జట్టు 71 పరుగుల వద్ద ఔటైంది. అయితే, రియాన్ పరాగ్ ఒకవైపు నిలబడి 45 బంతుల్లో 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతడు షిమ్రాన్ హెట్‌మైర్‌తో కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రాజస్థాన్‌ను మ్యాచ్‌లోకి తిరిగి తీసుకొచ్చాడు. హిట్మెయర్ 23 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాడు.
రియాన్ పరాగ్ కృషి వృథా
ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ 27 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో హిట్మెయర్ తో కలిసి ఒక ఓవర్‌లో 32 పరుగులు రాబట్టాడు. అతడు 45 బంతుల్లో 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 6 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు. RR విజయం దాదాపు ఖాయంగా కనిపించింది. కానీ 18వ ఓవర్‌లో హర్షిత్ రాణా అతడిని 95 పరుగుల వద్ద ఔట్ చేసి KKRను మ్యాచ్‌లోకి తిరిగి తీసుకొచ్చాడు.
చివరి 2 ఓవర్లలో 33 పరుగులు అవసరం
రాజస్థాన్ రాయల్స్‌కు చివరి 2 ఓవర్లలో విజయం కోసం 33 పరుగులు చేయాల్సి ఉంది. రియాన్ పరాగ్ ఔట్ కావడంతో రాజస్థాన్ కష్టాలు పెరిగాయి. 19వ ఓవర్‌లో ఆండ్రూ రస్సెల్ 11 పరుగులు ఇచ్చాడు. దీంతో చివరి 6 బంతుల్లో RR ముందు 22 పరుగుల లక్ష్యం ఉంది. చివరి బంతిపై రాజస్థాన్‌కు విజయం కోసం 3 పరుగులు అవసరం. కానీ రాజస్థాన్ కేవలం ఒకే రన్ పరుగెత్తగలిగింది.
Also Read: The Trump Organization : హైదరాబాద్ పై ట్రంప్ కన్ను..సిటీ ఎలా మారుతుందో..!!
ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పరాగ్
రియాన్ పరాగ్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఒక అసాధారణ ఘనత సాధించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ సాధించలేదు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాన్ ఆరు బంతుల్లో 6 సిక్సర్లు కొట్టాడు. రియాన్ మొయిన్ అలీని లక్ష్యంగా చేసుకొని వరుసగా ఆకాశాన్ని తాకే సిక్సర్లు కొట్టాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన రియాన్.. తర్వాతి ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి ఓవర్‌లో ఒక సిక్సర్ బాది ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఎవరూ సాధించని ఘనతను సాధించాడు.