Ravindra Jadeja: జడేజా అద్భుత శతకం.. టెస్టుల్లో ధోని రికార్డు సమం!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన చివరి టెస్ట్ మ్యాచ్ 2014 డిసెంబర్ 26న ఆడాడు. ధోని తన టెస్ట్ కెరీర్‌లో 90 మ్యాచ్‌ల్లో 38.09 సగటుతో 4,876 పరుగులు చేశాడు.
- By Gopichand Published Date - 06:55 PM, Fri - 3 October 25

Ravindra Jadeja: భారత్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్‌లు వెస్టిండీస్ బౌలర్లను మోకరిల్లేలా చేశారు. ఈ సిరీస్‌లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో జడేజా పటిష్టమైన సెంచరీ చేసి రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 104 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ సెంచరీతో జడేజా భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో సెంచరీలు సాధించిన వారి జాబితాలో జడేజా ఇప్పుడు ధోనీకి సమానంగా నిలిచాడు.
ధోని రికార్డును సమం చేసిన జడేజా
వెస్టిండీస్‌తో జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్‌కు శుభమన్ గిల్ భారత జట్టు కెప్టెన్‌గా ఉండగా భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొలిసారిగా జట్టుకు ఉప-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఉప-కెప్టెన్‌గా తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే జడేజా సెంచరీ చేయడం విశేషం. దీనితో రవీంద్ర జడేజా టెస్ట్ కెరీర్‌లో సెంచరీల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఎంఎస్ ధోని కూడా తన టెస్ట్ కెరీర్‌లో 6 సెంచరీలు మాత్రమే సాధించాడు. దీంతో జడేజా ఇప్పుడు టెస్టుల్లో సెంచరీల విషయంలో ధోనితో సమానం అయ్యాడు.
Also Read: Jadeja- Jurel Century: రెండో రోజు ముగిసిన ఆట.. భారత బ్యాటర్ల సెంచరీల మోత!
4,000 పరుగులకు జడేజా దూరం 10 పరుగులే!
వెస్టిండీస్‌తో ఈ మ్యాచ్‌కు ముందు జడేజా 85 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 37.72 సగటుతో 3,886 పరుగులు చేశాడు. ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే జడేజా 106 పరుగులు (ఆట ముగిసే సమయానికి 104 నాటౌట్) చేశాడు. జడేజా ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో 4,000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నాడు. మ్యాచ్ మూడవ రోజున భారత జట్టుకు చెందిన ఈ ఆటగాడు టెస్ట్ క్రికెట్‌లో 4,000 పరుగుల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ఇది జడేజాకు ఆరవ టెస్ట్ సెంచరీ. దీంతో పాటు అతను టెస్టుల్లో 27 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.
ఎంఎస్ ధోని రికార్డు వివరాలు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన చివరి టెస్ట్ మ్యాచ్ 2014 డిసెంబర్ 26న ఆడాడు. ధోని తన టెస్ట్ కెరీర్‌లో 90 మ్యాచ్‌ల్లో 38.09 సగటుతో 4,876 పరుగులు చేశాడు. ధోని టెస్టుల్లో 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు జడేజా టెస్ట్ క్రికెట్‌లో సెంచరీల విషయంలో ధోనితో సమానం కావడం గమనార్హం.