Umran Malik: సౌతాఫ్రికా టీ20 సిరీస్ టీమిండియా జట్టులో కాశ్మీరి ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ కు చోటు..!!
జమ్మూకశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ శ్రమ ఫలించింది. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్ టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు.
- By Hashtag U Published Date - 12:42 AM, Mon - 23 May 22

జమ్మూకశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ శ్రమ ఫలించింది. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్ టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. భారత జట్టులో ఉమ్రాన్ మాలిక్ ఎంపికైన తర్వాత జమ్మూలోని గుజ్జర్ నగర్‌లో సంబరాల వాతావరణం నెలకొంది. ఉమ్రాన్ మాలిక్ అతని కుటుంబాన్ని కాశ్మీర్ ప్రజలు అభినందిస్తున్నారు.
ఉమ్రాన్ మాలిక్ స్నేహితులు, కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచి ఈ ప్రత్యేక సందర్భాన్ని సంబరంగా జరుపుకున్నారు. తమ కొడుకు టీమ్ ఇండియాలో ఎంపికైన సందర్భంగా ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ, ‘తనకు ఇంత ప్రేమను అందించినందుకు నేను మొత్తం దేశానికి ధన్యవాదాలు. ఇదంతా ఉమ్రాన్ కృషి వల్లే జరిగింది. దేశం గర్వించేలా చేస్తాడు. అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం ఉమ్రాన్ కు తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపాడు.
22 ఏళ్ల ఉమ్రాన్ టీమ్ ఇండియా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఉమ్రాన్ తండ్రి అబ్దుల్ మాలిక్ స్థానికంగా పండ్లు, కూరగాయల దుకాణాన్ని నడుపుతున్నాడు. నాలుగేళ్ల క్రితం గుజ్జర్ నగర్‌లోని కాంక్రీట్ పిచ్‌పై ఉమ్రాన్ కెరీర్ ప్రారంభించాడు. 17 సంవత్సరాల వయస్సు వరకు, అతను ఎటువంటి క్రికెట్ కోచింగ్ తీసుకోలేదు. అసలు ప్రొఫెషనల్ క్రికెట్ బాల్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఉమ్రాన్ ‘మొహల్లా’ టెన్నిస్ బాల్ టోర్నమెంట్‌లలో ఆడాడు. అక్కడే అతడు తన ప్రతిభను చాటి రూ. 500 నుండి రూ. 3000 వరకు ప్రైజ్ మనీ సంపాదించాడు.
ఉమ్రాన్ మాలిక్ ప్రొఫెషనల్ కెరీర్ 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జమ్మూ, కాశ్మీర్ తరపున 18 జనవరి 2021న తన T20 అరంగేట్రం చేసాడు. 2020–21 విజయ్ హజారే ట్రోఫీలో జమ్మూ, కాశ్మీర్ తరపున 27 ఫిబ్రవరి 2021న తన లిస్ట్ A అరంగేట్రం చేసాడు. సెప్టెంబర్ 2021లో మాలిక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో T.నటరాజన్‌కి గాయపడటంతో రీప్లేస్ మెంట్ గా వచ్చాడు.
ఆ సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే పాల్గొనే అవకాశం లభించింది. ఉమ్రాన్ ప్రతిభను చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ వేలానికి ముందు ఉమ్రాన్ మాలిక్‌ను తన వద్ద ఉంచుకుంది. ఇక IPL 2022లో, ఉమ్రాన్ మాలిక్ రెచ్చిపోయాడు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో, మొత్తం 13 మ్యాచ్‌లలో 20 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని అత్యుత్తమ ప్రదర్శన 25 పరుగులకు 5 వికెట్లు కావడం విశేషం.