Hardik Pandya : తగ్గేదే లే…టైటిలే టార్గెట్ అంటున్న హార్దిక్
ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ సారథిగా ఎంపికయ్యాక హార్ధిక్ పాండ్యా దుమ్మురేపుతున్నాడు
- By Naresh Kumar Published Date - 04:54 PM, Wed - 27 April 22

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ సారథిగా ఎంపికయ్యాక హార్ధిక్ పాండ్యా దుమ్మురేపుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో వరుస ఆఫ్ సెంచరీలతో రాణించడంతో పాటు గుజరాత్ టైటాన్స్ జట్టును పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. అయితే ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ ముంగిట తన ఆటతీరు, బ్యాటింగ్ ఆర్డర్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తనకు మూడో స్థానంలో బ్యాటింగ్ దిగడం కల అని, గుజరాత్ టైటాన్స్‌ను ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ విన్నర్ గా నిలబెట్టడమే తన ముందున్న లక్ష్యమన్నాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగాలన్నది నా కోరిక. 2016లో ముంబై తరఫున ఆ స్థానంలో బ్యాటింగ్ చేశాను. కానీ అప్పుడు అంతగా రాణించలేకపోయాను. మళ్ళి ఇన్నాళ్లకు గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున మూడో స్థానంలో ఆడే అవకాశం లభించింది.
ఇప్పుడు తప్పకుండా ఆ స్థానంలో నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తాను అలాగే ప్రస్తుతం బాగా బ్యాటింగ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఒకవేళ ఓపెనర్ శుభమాన్ గిల్ సరైన సహకారం అందిస్తే మరిన్ని భారీ స్కోర్లు సాదిస్తాను అని హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు.ఇక హార్దిక్ పాండ్యా ఈసారి ఐపీఎల్ లో ఆడిన 6 మ్యాచ్‌లలో 73.75సగటుతో 295పరుగులు చేసిఅత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్య 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 67పరుగులతో దుమ్మురేపాడు. ఇదిలాఉంటే.. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు హార్ధిక్ పాండ్యా పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు.అయితే, ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ హార్ధిక్ పాండ్యపై నమ్మకంతో సారథ్య బాధ్యతల్ని అప్పజెప్పింది. ఈ క్రమంలోనే హార్ధిక్ పాండ్య అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా అలాగే బౌలర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు.