New Cricket Stadium : ఏపీలో కొత్త క్రికెట్ స్టేడియాలు..ఎక్కడెక్కడో తెలుసా..?
New Cricket Stadium : అమరావతి ప్రాజెక్ట్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రికెట్ మైదానాలను అభివృద్ధి చేయాలని ACA లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, కర్నూలులో స్టేడియాల కోసం భూ సేకరణ పూర్తయింది
- By Sudheer Published Date - 04:49 PM, Fri - 22 August 25

ఆంధ్రప్రదేశ్(AP)లో క్రీడా రంగం అభివృద్ధికి ప్రభుత్వం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) కలిసి ముందడుగు వేస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని అమరావతిలో నిర్మించబోతున్న క్రికెట్ స్టేడియం రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ఉండబోతోంది. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ స్టేడియం దేశంలోని అతిపెద్ద క్రికెట్ మైదానాలలో ఒకటిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఖర్చు రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ACA కార్యదర్శి, ఎంపీ సానా సతీష్ వివరించిన ప్రకారం.. అమరావతి క్రికెట్ స్టేడియాన్ని 60 వేల సీట్లు కలిగిన మల్టీ ఈవెంట్ స్టేడియంగా తీర్చిదిద్దబోతున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మైదానం నిర్మాణం చేపట్టి, ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు, టోర్నమెంట్లు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం క్రికెట్ స్టేడియం 17 ఏళ్లుగా ఉన్నదని, కనీస సౌకర్యాలు కూడా దెబ్బతిన్న సందర్భంలో మరమ్మత్తులు చేసినట్లు గుర్తు చేశారు.
అమరావతి ప్రాజెక్ట్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రికెట్ మైదానాలను అభివృద్ధి చేయాలని ACA లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, కర్నూలులో స్టేడియాల కోసం భూ సేకరణ పూర్తయింది. అలాగే విజయనగరం, అనంతపురం, మూలపాడులో క్రికెట్ అకాడమీలు స్థాపించి, ఒక్కో అకాడమీలో 40–50 మంది ప్లేయర్లకు ట్రైనింగ్ ఇచ్చేలా సదుపాయాలు కల్పించనున్నారు. కోచ్‌లు, ఫిజియోలు, ఆధునిక సౌకర్యాలతో ఈ అకాడమీలు రాష్ట్రానికి ప్రతిభావంతులైన ఆటగాళ్లను అందించేలా ప్రయత్నించనున్నట్లు ACA వెల్లడించింది.