Rafael Nadal: తగ్గేదే లే…స్పెయిన్ బుల్ దే ఫ్రెంచ్ ఓపెన్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 టైటిల్స్... 114 మ్యాచ్ లలో 111 విజయాలు... కేవలం 3, మ్యాచ్‌లలో ఓటమి... ఈ గణంకాలు చాలు అతని సామర్ధ్యం చెప్పడానికి.
- Author : Naresh Kumar
Date : 05-06-2022 - 10:01 IST
Published By : Hashtagu Telugu Desk
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 టైటిల్స్… 114 మ్యాచ్ లలో 111 విజయాలు… కేవలం 3, మ్యాచ్‌లలో ఓటమి… ఈ గణంకాలు చాలు అతని సామర్ధ్యం చెప్పడానికి. ఆ గడ్డపై అతడిని ఓడించడం సంగతి దేవుడెరుగు… అలాంటి ఆలోచన రావడం కూడా ఒక సాహసమే. ఎందుకంటే ఎర్రమట్టి అంటే అతనికి అంత ప్రేమ..ఈ పాటికే అందరికీ అర్థమై ఉంటుంది…అతనెవరో..స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్. క్లే కోర్టులో 17 యేళ్ళుగా ఆధిపత్యం కనబరుస్తున్న నాదల్ తన కెరీర్ లో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకున్నాడు.
ఊహించినట్టుగానే ఫైనల్లో నాదల్ జోరు ముందు కాస్పర్ రూడ్ నిలవలేకపోయాడు. రెండుసార్లు నాదల్ సర్వీస్ బ్రేక్ చేసినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫలితంగా ఫైనల్లో నాదల్ 6-3 , 6-3, 6-0 స్కోరు తో రూడ్ పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో కాస్త పోటీ ఇచ్చిన రూడ్ మూడో సెట్ లో మాత్రం చేతులెత్తేశాడు.
ఈ విజయంతో నాదల్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. నాదల్ కెరీర్ లో ఇది 14వ ఫ్రెంచ్ ఓపెన్. అలాగే ఓవరాల్ గా అతని కెరీర్ లో ఇది 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇక 36 ఏళ్ల వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీ ఫైనల్ చేరిన ప్రతీసారీ విజేతగా నిలిచిన రఫా ఆ రికార్డును నిలబెట్టుకున్నాడు. నిజానికి పాదం గాయం నుంచి కోలుకున్న తర్వాత నాదల్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలవడం కష్టమే అని చాలా మంది భావించారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఎర్రమట్టి పై తన ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు.
Make it 14 🧡#RolandGarros | @RafaelNadal pic.twitter.com/NbTLuOzxkp
— Roland-Garros (@rolandgarros) June 5, 2022