Hardik Pandya:తనకు గాయం తగిలిన చోటే నేడు హీరోగా…
పోయిన చోటే వెతుక్కోవాలన్నది సామెత...వెన్నునొప్పితో ఆటకు దూరమై... ఫామ్ కోల్పోయి...ఫిట్ నెస్ సమస్యలతో జట్టులో చోటే ప్రశ్నార్థకమైన వేళ టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా పడిన వేదన అంతా ఇంతా కాదు.
- Author : Naresh Kumar
Date : 29-08-2022 - 2:18 IST
Published By : Hashtagu Telugu Desk
పోయిన చోటే వెతుక్కోవాలన్నది సామెత…వెన్నునొప్పితో ఆటకు దూరమై… ఫామ్ కోల్పోయి…ఫిట్ నెస్ సమస్యలతో జట్టులో చోటే ప్రశ్నార్థకమైన వేళ టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా పడిన వేదన అంతా ఇంతా కాదు. దాదాపు ఏడాదిన్నర క్రితం నుంచీ పాండ్యా వెన్నునొప్పితో సతమతమయ్యాడు. ఆల్ రౌండర్ అన్న ట్యాగ్ ఇక అతనికి కష్టమేనని అందరూ అభిప్రాయానికొచ్చేశారు. అసలు పాండ్యాకు వెన్నునొప్పి సమస్య మొదలైన చోటే ఇప్పుడు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. 2018 ఆసియా కప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పై మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. నడవలేని స్థితిలో పాండ్యాని స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆ వెన్నునొప్పితో చాలాకాలం పాటు బాధపడ్డాడు. 2021 ఆసియా కప్‌లోనూ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. అయిదు మ్యాచ్‌లల్లో నాలుగు ఓవర్లు మాత్రమే వేశాడు. ఫిట్ నెస్ సమస్యలు వెంటాడడం, అలాగే బౌలింగ్ వేయలేకపోతుండడంతో జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. ఇక లాభం లేదనుకున్న పాండ్యా సర్జరీ తర్వాత ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు. మెల్లిగా బౌలింగ్ లయ కూడా అందుకున్నాడు.
ఐపీఎల్ 15వ సీజన్ ద్వారా రీఎంట్రీని ఘనంగా చాటుకున్న పాండ్యా గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలిపాడు. దీంతో మళ్ళీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేసి ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. అయితే ఏ గ్రౌండ్ లో అయితే తాను స్ట్రెచర్ పై మైదానాన్ని వీడాడో… ఇప్పుడు అదే చోట ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. అదే ప్రత్యర్థిపై గుర్తుండిపోయే ప్రదర్శన కనబరిచాడు. కేవలం బంతితోనే కాదు బ్యాట్ తోనూ అదరగొట్టి భారత్ కు విజయాన్ని అందించాడు. ఐపీఎల్ లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటకీ… అంతర్జాతీయ క్రికెట్ లో అందులోనూ చిరకాల ప్రత్యర్థి పాక్ పై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తే ఒక ప్లేయర్ కు అంతకన్నా గుర్తింపు ఇంకేముంటుంది. ప్రస్తుతం ఈ సంతోషాన్ని పాండ్యా ఆస్వాదిస్తున్నాడు. వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత్ కు కీలకం కానున్నాడని చాలా అంచనాలున్న పాండ్యా ఆసియాకప్ లో తన సత్తా నిరూపించుకున్నాడు. ఒత్తిడిలో ఆడే ఇన్నింగ్స్ కు క్రికెట్ లో ఎప్పుడూ ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పాక్ పై ఆదివారం ఇదే తరహా ఇన్నింగ్స్ ఆడిన పాండ్యాపై ఇప్పుజు ప్రశంసల జల్లు కురుస్తోంది. అప్పుడు స్ట్రెచర్ పై గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళిన ఈ ఆల్ రౌండర్ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో సగర్వంగా నిలిచాడంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.