MI beats DC: ఎట్టకేలకు ముంబైకి తొలి విజయం.. పోరాడి ఓడిన ఢిల్లీ
ఐపీఎల్ 16వ సీజన్ లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని రుచి చూసింది.
- By Naresh Kumar Published Date - 11:21 PM, Tue - 11 April 23

MI beats DC: ఐపీఎల్ 16వ సీజన్ లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని రుచి చూసింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ ముంబై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వి షా తొలి వికెట్ కు 33 పరుగులు జోడించారు. పృథ్వీ షా 15 రన్స్ కు ఔటవ్వగా..తర్వాత మనీశ్ పాండేతో కలిసి వార్నర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. అయితే ధాటిగా ఆడే క్రమంలో వరుస వికెట్లు కోల్పోయింది. మనీశ్ పాండే 26 రన్స్ చేయగా… యశ్ ధూల్, రోవ్‌మన్ పోవెల్, లలిత్ యాదవ్ లను నిరాశ పరిచారు.
Mumbai Indians win off the final delivery! 🙌
Another final-over thriller in #TATAIPL 2023! 💥💥#DCvMI https://t.co/2UAkGXvqMG
— IndianPremierLeague (@IPL) April 11, 2023
దీంతో ఢిల్లీ 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో అక్షర్ పటేల్ అదరగొట్టాడు. మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వార్నర్ కాస్త నెమ్మదిగా ఆడినా అక్షర్ పటేల్ మాత్రం దూకుడుగా ఆడుతూ స్కోర్ పెంచాడు. పలు క్యాచ్‌లను ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు వదిలేయడం కూడా ఢిల్లీకి కలిసొచ్చింది. మెరిడిత్ 18వ ఓవర్‌లో 4, 6 బాదిన అక్షర్ పటేల్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వార్నర్ , అక్షర్ వెంట వెంటనే ఔటవడంతో ఢిల్లీ కుప్పకూలింది. చివరి 5 వికెట్లను ఢిల్లీ 15 రన్స్ తేడాతో చేజార్చుకుంది. ఢిల్లీ 19.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో చావ్లా, బెహెండార్ఫ్ మూడేసి వికెట్లు పడగొట్టగా… రిలే మెరిడిత్ రెండు వికెట్లు , హృతిక్ షోకీన్ ఓ వికెట్ పడగొట్టాడు.
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ భారీ షాట్లతో విరుచుకు పడ్డారు. వీరిద్దరి జోరుతో ముంబై పవర్ ప్లేలో 68 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ ఔటైనా. రోహిత్ శర్మ మరింత దూకుడుగా ఆడాడు. తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అటు హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ మరోసారి అదరగొట్టాడు. తన ఫామ్ కొనసాగిస్తూ చూడచక్కని షాట్లు కొట్టాడు. తిలక్ వర్మ కేవలం 26 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అయితే చివర్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ , రోహిత్ శర్మ వరుసగా ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రోహిత్ 45 బంతుల్లో 6 ఫోర్లు , 4 సిక్సర్లతో 65 రన్స్ చేసి కీలక సమయంలో వెనుదిరిగాడు. ఈ దశలో టిమ్ డేవిడ్ , కామెరూన్ గ్రీన్ ముంబైని గెలిపించారు. వీరిద్దరూ హిట్టర్స్ కావడంతో ఢిల్లీ బౌలర్లు పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ సీజన్ లో ముంబైకి ఇదే తొలి విజయం. అటు ఢిల్లీ మాత్రం ఇంకా ఖాతా తెరవలేదు.