Rohit Sharma: ‘హిట్ మ్యాన్’కు ఏమైంది..?
బ్యాట్ పడితే దెబ్బకు బంతి బౌండరీ దాటాలి. రోహిత్ శర్మ కెపాసిటీ అది. పైగా టీట్వంటీ లీగ్ హిస్టరీని తీసుకోండి.. తన టీమ్ కు ఐదుసార్లు కప్ ని ఇచ్చాడు. అంటే కెప్టెన్ గా తోపు కిందే లెక్క.
- By Hashtag U Published Date - 11:38 AM, Sun - 17 April 22
బ్యాట్ పడితే దెబ్బకు బంతి బౌండరీ దాటాలి. రోహిత్ శర్మ కెపాసిటీ అది. పైగా టీట్వంటీ లీగ్ హిస్టరీని తీసుకోండి.. తన టీమ్ కు ఐదుసార్లు కప్ ని ఇచ్చాడు. అంటే కెప్టెన్ గా తోపు కిందే లెక్క. ఇక్కడ తోపు అని ఎందుకంటున్నామంటే.. కెప్టెన్ గా నెంబర్ వన్ ఎవరు అంటే వెంటనే అందరూ ఎం.ఎస్.ధోనీ పేరు చెబుతారు. అలాంటి ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డును మనోడు కొట్టాడు. విరాట్ కోహ్లీ నుంచి ఎప్పుడైతే కెప్టెన్సీ తీసుకున్నాడో… అప్పటి నుంచి టీమిండియాలో దూకుడు పెంచాడు. మంచి పేరు సంపాదించాడు. అందుకే రోహిత్ ను హిట్ మ్యాన్ అంటారు. అలాంటి రోహిత్ కెప్టెన్సీలో ముంబయి ఇప్పటివరకు ఎందుకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది? దీనికి కారణాలు ఏమిటి?
ముంబై కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు కాబట్టే టీమిండియా కెప్టెన్ గా సెలక్ట్ అవ్వగలిగాడు రోహిత్. టీ20 లీగ్ లో చాలా పోటీ ఉంటుంది. అలాంటి చోట రోహిత్ శర్మ ఐదుసార్లు టీమ్ ను గెలిపించాడంటే నిజంగా ఛాంపియనే. నిజానికి విరాట్ కోహ్లీ కంటే ముందే రోహిత్ కు కెప్టెన్సీ దక్కాల్సింది. కానీ విరాట్ దూకుడు వల్లే రోహిత్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఎప్పుడైతే విరాట్ పక్కకు తప్పుకున్నాడో.. బీసీసీఐకి వేరే ఆప్షన్ అవసరం లేకపోయింది. వెంటనే రోహిత్ కు పట్టం కట్టేసింది. హిట్ మ్యాన్ అంటే అంత నమ్మకం మరి. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాల్సి ఉంది. రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 34 ఏళ్లు. అంటే ఇంకో నాలుగైదేళ్లకు మించి క్రికెట్ ఆడడం కష్టం. అయినా అదేమీ ఆలోచించకుండా కెప్టెన్సీ ఇచ్చిందంటే.. రోహిత్ మీద ఎంత కాన్ఫిడెన్సో ఆలోచించాలి. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో రోహిత్ ఎందుకు తడబడుతున్నాడు?
కెప్టెన్సీ భుజాల మీద ఉంటే చాలామంది ఆటగాళ్లు ఫామ్ కోల్పోతారంటారు. విరాట్ కోహ్లీ కూడా కొన్ని కీలక మ్యాచుల్లో ఇలాగే చేశాడు. అందుకే ఇప్పుడు రోహిత్ కు కెప్టెన్సీ ఏమైనా భారంగా మారిందా అన్నది ప్రశ్న. నిజానికి కోచ్ రాహుల్ ద్రవిడ్ సాయంతో సిరీస్ లన్నీ గెలుచుకోగలుగుతున్నాడు రోహిత్. ఇప్పటికే విండీస్, లంక, న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లలో విజయం సాధించి చూపించాడు. ఇప్పుడు కొత్త ఉత్సాహంతో టీ20 లీగ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ముంబయి టీమ్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడింది. కానీ ఒక్కటంటే ఒక్కటీ గెలుచుకోలేకపోయింది. ఇది రోహిత్ కెప్టెన్సీ వైఫల్యమా? లేకపోతే ఆటగాళ్లు ఆడలేకపోతున్నారా?
కిందటి సీజన్ వరకు లెక్కేస్తే.. ముంబయి టీమ్ లో బ్యాటర్లు, బౌలర్ల మధ్య తూకం సరిపోయేది. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే.. సీనియర్లేమో ఫామ్ కోల్పోయారు. మిగిలినవాళ్లు యంగ్ క్రికెటర్స్. బుమ్రాకు సరైన జోడీ లభించడం లేదు. హిట్టర్ అనుకున్న కీరన్ పొలార్డ్ నమ్మకాన్ని కోల్పోయాడు. తిలక్, ఇషాన్, బ్రెవిస్, సూర్యకుమార్.. ఇలాంటి క్రికెటర్స్ రాణిస్తున్నా అది జట్టు విజయానికి తోడ్పడడం లేదు. ఇక రోహిత్ కానీ భారీ స్కోర్ చేస్తే అది జట్టుకు కచ్చితంగా దోహడపడేది. కానీ అలా జరగడం లేదు.
మేనేజ్ మెంట్ పరంగా చుస్తే.. ముంబై టీమ్ కు ఫుల్ ప్రీడమ్ ఉంది. అందుకే ఆ జట్టు ఆటగాళ్లు కూడా చాలా సంతోషంగా ఆడతారంటారు. పైగా ఆటగాళ్లకు ధర ఎక్కువే పెడుతుంది. అలాగనే.. జోఫ్రా ఆర్చర్ ను భారీగా రేటు పెట్టి కొన్నాడు. కానీ ఈ క్రికెటర్ ఈ సీజన్ కు అందుబాటులో లేకుండా పోయాడు. విదేశీ బౌలర్లు కదా రాణిస్తారులే అనుకున్నా.. డానియల్ సామ్స్, మిల్స్ కూడా మెరుపులు మెరిపించడం లేదు. ఇక థంపి, జయదేవ్ లాంటి ఫాస్ట్ బౌలర్లు అనుకున్న మేర ప్రతిభను చూపడం లేదు. అంటే బౌలర్ల పరంగా మ్యాచ్ ను గెలుచుకోవడం కష్టమని అర్థమవుతోంది. సరే.. బ్యాటింగ్ లో కాని దమ్ము చూపిస్తే.. కచ్చితంగా భారీ స్కోర్ చేయచ్చు. అయినా అది కూడా జరగడం లేదు. ఇలాంటి సమయంలోనే బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతూకం పాటించేలా.. సమన్వయం చేసుకునేలా రోహిత్ మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది.
రోహిత్ ఐదు మ్యాచుల్లో కలిపి కేవలం 108 పరుగులే చేయగలిగాడు. పోనీ ఇందులో ఒక్క మ్యాచ్ లో అయినా.. ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టేలా, పైచేయి సాధించేలా ఆడాడా అంటే అదీ లేదు. చూడాలి ఇకపై ఎలా ఆడతాడో! కెప్టెన్ గా రాణించడంతోపాటు బ్యాటింగ్ లోనూ దుమ్ముదులిపితేనే ముంబయికి మళ్లీ పూర్వవైభవం వస్తుంది. మరి హిట్ మ్యాన్ ఏం చేస్తాడో చూడాలి
Related News
MI vs KKR: ముంబైకి డూ ఆర్ డై.. ఇవాళ ఓడితే ఇంటికే..!
ఐపీఎల్లో నేడు అంటే శుక్రవారం ముంబై ఇండియన్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ని వారి స్వగృహంలో ఢీకొంటుంది.