Captain Dhoni: చెన్నై కెప్టెన్‌గా మళ్ళీ ధోనీ
ఐపీఎల్ 15వ సీజన్ మధ్యలో చెన్నై సూపర్‌కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
- Author : Naresh Kumar
Date : 30-04-2022 - 10:19 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 15వ సీజన్ మధ్యలో చెన్నై సూపర్‌కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా మళ్ళీ ధోనీని నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సీజన్ ఆరంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించడంతో జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే జడేజా కెప్టెన్సీలో చెన్నై పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇప్పటి వరకూ కేవలం రెండే మ్యాచ్‌లు గెలిచింది. దీంతో పాటు వ్యక్తిగత ఆటతీరులోనూ జడేజా ఫ్లాపయ్యాడు. ఇక కెప్టెన్సీ తన వల్ల కాదని చేతులెత్తేశాడు.
ఆ బాధ్యతలను మోయలేనంటూ జడేజా ఫ్రాంచైజీకి చెప్పినట్టు తెలుస్తోంది. మరో ఆలోచన లేకుండా సీఎస్‌కే యాజమాన్యం వెంటనే ధోనీకి పగ్గాలు అప్పగించింది. దీనికి ధోనీ కూడా అంగీకరించినట్లు సీఎస్కే ట్వీట్ చేసింది. సీజన్ ఆరంభానికి మూడు రోజుల ముందు చెన్నై కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ప్రత్యామ్నాయ సారథిగా జడేజాకు కెప్టెన్సీ అప్పగించారు. గతంలో ఎన్నడూ కెప్టెన్సీ చేసిన అనుభవం లేని జడేజా జట్టును సమర్థవంతంగా లీడ్ చేయలేకపోయాడు.
కెప్టెన్సీ భారం వల్లో ఏమోగానీ వ్యక్తిగతంగానూ జడేజా మునుపటి రీతిలో ఆడలేకపోతున్నాడు. నిజానికి ఈ సీజన్‌లో జడేజా కెప్టెన్ అయినా కూడా గ్రౌండ్‌లో చాలా వరకూ ఫీల్డ్ సెట్ చేయడం, బౌలర్లను మార్చడంలో ధోనీయే కీలకపాత్ర పోషించాడు. ఈ విషయంలో జడేజా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయిన తర్వాత ఆర్సీబీపై తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌లలో మరో రెండు మ్యాచ్‌లు ఓడింది.
ప్రస్తుతం ఆ టీమ్ పాయింట్ల టేబుల్లో 9వస్థానంలో ఉంది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరాలంటే టోర్నీలో మిగిలిన 6 మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.ధోనీ నాయకత్వంలో సీఎస్‌కే నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే జడేజా కెప్టెన్సీ భారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లీగ్‌కు ముందు సూపర్ ఫామ్‌లో ఉన్న అతను.. కెప్టెన్సీ కారణంగా ఒక్క విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపరుచుకునేందుకు సారథ్య బాధ్యతలను వదిలేసాడు.
📢 Official announcement!
Read More: 👇#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022