FIFA WC 2026: 200వ గోల్ తో చరిత్ర సృష్టించిన మెస్సీ
- Author : Vamsi Chowdary Korata
Date : 17-06-2026 - 10:46 IST
Published By : Hashtagu Telugu Desk
లియోనెల్ మెస్సీ.. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులకు కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అదొక ఎమోషన్. మైదానంలో ఎంతటి ఒత్తిడినైనా చిరునవ్వుతో భరిస్తూ, భావోద్వేగాలను పూర్తి కంట్రోల్‌లో ఉంచుకోగలరు కాబట్టే ఆయన ఆ స్థాయికి చేరారు. అయితే, ఎంతటి దిగ్గజమైనా మనిషే కదా! మంగళవారం అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ తొలి గోల్ కొట్టిన వెంటనే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది.
సాధారణంగా వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లోనో, లేదా ఫైనల్లో ఓడిపోయినప్పుడో ఆటగాళ్లు ఏడవడం చూస్తాం. కానీ ఇది అలాంటి కీలకమైన నాకౌట్ మ్యాచ్ కాదు. పైగా అర్జెంటీనా ఓడిపోలేదు. అద్భుత విజయంతో దూసుకుపోతోంది. మరి అలాంటప్పుడు మెస్సీ కళ్లలో ఆ నీళ్లు ఎందుకు తిరిగాయి? ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఆ కన్నీళ్లకు కారణం
మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ తన కన్నీళ్ల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. ఆ భావోద్వేగానికి, ఫుట్‌బాల్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఇటీవల తాను వ్యక్తిగతంగా క్లిష్ట పరిస్థితులు, కఠినమైన రోజుల్ని ఎదుర్కొన్నానని, ఆ మానసిక ఒత్తిడి వల్లే మైదానంలో కన్నీళ్లు వచ్చాయని చెప్పాడు. ప్రస్తుతం తాను ఆ సమస్యల నుంచి నెమ్మదిగా బయటపడుతున్నట్లు తెలిపినప్పటికీ.. ఆ ఇబ్బందులు ఏంటనేది మాత్రం పూర్తిగా వెల్లడించలేదు.
జట్టు సభ్యులకు మెస్సీ కృతజ్ఞతలు
తాను వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో తనకు అండగా నిలిచిన అర్జెంటీనా జట్టు సహచరులకు, బృంద సభ్యులకు మెస్సీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. తాను మానసికంగా బాగుండేలా ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధ తీసుకున్నారని వెల్లడించారు. వారి ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగంగా మాట్లాడాడు.
రికార్డుల వేట
అల్జీరియాపై మూడు గోల్స్ చేయడంతో మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో తన తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఇదే సమయంలో వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజే రికార్డును కూడా మెస్సీ సమం చేయడం విశేషం. ప్రస్తుతం తన కెరీర్‌లో అనుభవిస్తున్న ఈ అద్భుతమైన దశను ‘చెర్రీ ఆన్ టాప్’ (అంతకంటే మధురమైనది లేదు) అంటూ అభివర్ణించాడు. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, ఇప్పుడు ఈ జట్టుతో గడుపుతున్న ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నానని చెప్పాడు.
కోచ్ ప్రశంసల వర్షం
మరోవైపు మెస్సీ అద్భుత ప్రదర్శనపై అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోనీ ప్రశంసల వర్షం కురిపించారు. మైదానంలో మెస్సీ ఆడుతున్న తీరును చూస్తుంటే అసలు మాటలు రావడం లేదన్నారు. అతడొక అద్భుతమైన ఆటగాడని కొనియాడారు.