Martin Guptill: లెజెండ్ 90 లీగ్లో మార్టిన్ గుప్టిల్ ఊచకోత, 300 స్ట్రైక్ రేట్‌తో 160 పరుగులు
మార్టిన్ గుప్టిల్ లెజెండ్ ఛత్తీస్‌గఢ్ వారియర్స్ జట్టుకు ఆడుతున్నాడు. తాజాగా ఛత్తీస్‌గఢ్ వారియర్స్ మరియు బిగ్ బాయ్స్ యూనియన్ మధ్య మ్యాచ్ జరిగింది.
- By Naresh Kumar Published Date - 11:02 PM, Tue - 11 February 25

Martin Guptill: ఐపీఎల్ గ్రాండ్ సక్సెస్ తో ప్రపంచ దేశాలు సొంతంగా లీగ్ లను ప్రవేశపెడుతున్నాయి. ఈ లీగ్ లలో ఆయా దేశాల స్టార్ క్రికెటర్లు పాల్గొననుండటంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు లెజెండ్ 90 లీగ్ ఒకటి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో లెజెండ్ 90 లీగ్ నిర్వహిస్తున్నారు. ఈ లీగ్లో 20 ఓవర్లకు బదులుగా 15 ఓవర్లు మాత్రమే ఉంటాయి. అయితే ఈ లీగ్‌లో ఆడుతున్న న్యూజిలాండ్ మాజీ స్టార్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ (Martin Guptill) విధ్వంసం సృష్టించాడు. 300 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 160 పరుగులతో ఊచకోత కోశాడు.
మార్టిన్ గుప్టిల్ లెజెండ్ ఛత్తీస్‌గఢ్ వారియర్స్ జట్టుకు ఆడుతున్నాడు. తాజాగా ఛత్తీస్‌గఢ్ వారియర్స్ మరియు బిగ్ బాయ్స్ యూనియన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుప్టిల్, రిషి ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ప్రత్యర్థులను చిత్తుచేశాడు. దీంతో ఆ జట్టు కేవలం 15 ఓవర్లలో వికెట్ కూడా నష్టపోకుండా 240 పరుగుల భారీ స్కోరును సాధించింది. గుప్టిల్ 49 బంతుల్లోనే 160 పరుగులు చేశాడు. ఈ కాలంలో 12 ఫోర్లు మరియు 16 సిక్సర్లు నమోదయ్యాయి. మరో ఎండ్‌లో రిషి ధావన్ 42 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
Also Read: WPL Full Schedule 2025: డబ్ల్యూపీఎల్ 2025 షెడ్యూల్, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్
241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బిగ్ బాయ్స్ 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 151 రన్స్‌కే పరిమితమైంది. రాబిన్ బిస్త్ (55) టాప్ స్కోరర్. సౌరభ్ తివారీ 37, గుణరత్నే 22 పరుగులు చేశారు. ఇక గుప్టిల్ ఈ భారీ ఇన్నింగ్స్ ద్వారా చరిత్ర సృష్టించాడు. టి20 ఫార్మెట్లో ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్. చరిత్రలో ఒక బ్యాట్స్‌మన్ 300+ స్ట్రైక్ రేట్‌తో 150 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే మొదటిసారి. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు 16 మంది బ్యాట్స్‌మెన్ మాత్రమే 150 మార్కును దాటారు. కానీ ఎవరూ 300 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించలేదు.