రోహిత్ శర్మకు అవమానం జరిగింది.. టీమిండియా మాజీ క్రికెటర్!
2024 అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత వన్డే జట్టును ప్రకటించారు. ఎప్పుడైతే శుభ్‌మన్ గిల్ పేరు పక్కన 'కెప్టెన్' అని కనిపించిందో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల యుగం ముగిసిందని భారత క్రికెట్ అభిమానులకు అర్థమైపోయింది.
- Author : Gopichand
Date : 16-01-2026 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma: 2024 అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత వన్డే జట్టును ప్రకటించారు. ఎప్పుడైతే శుభ్‌మన్ గిల్ పేరు పక్కన ‘కెప్టెన్’ అని కనిపించిందో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల యుగం ముగిసిందని భారత క్రికెట్ అభిమానులకు అర్థమైపోయింది. భారత్ తన కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న కొద్ది నెలలకే రోహిత్ శర్మ నుండి కెప్టెన్సీని లాగేసుకున్నారు. ఇప్పుడు దీనిపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ, గౌతమ్ గంభీర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
అగార్కర్ భుజంపై తుపాకీ పెట్టి కాల్చారు
ఇండియా టుడే కథనం ప్రకారం.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుండి తొలగించడంపై మనోజ్ తివారీ మాట్లాడుతూ.. “దీనికి ప్రధాన కారణం ఏమిటో నాకు తెలియదు. అజిత్ అగార్కర్ వ్యక్తిత్వం చాలా దృఢమైనది. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన వెనకడుగు వేయరు. అయితే ఎవరైనా తన భుజంపై తుపాకీ పెట్టి కాల్చమని ఆయనను ప్రభావితం చేశారేమో కూడా మనం ఆలోచించాలి” అని అన్నారు.
Also Read: బంగారం కొనాలనుకునేవారికి బిగ్ అలర్ట్.. 10 గ్రాముల ధర రూ. 40 లక్షలు?!
గౌతమ్ గంభీర్ కూడా
మనోజ్ తివారీ నేరుగా గౌతమ్ గంభీర్ పేరు తీయకుండానే.. ప్రపంచం ముందు ఈ నిర్ణయాన్ని చీఫ్ సెలెక్టర్ (అజిత్ అగార్కర్) వినిపించి ఉండవచ్చు. కానీ ఇందులో కోచ్ సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. “ఇలాంటి నిర్ణయాలు ఎవరూ ఒంటరిగా తీసుకోరు. దీనికి ఇద్దరూ సమాన బాధ్యులే” అని తివారీ పేర్కొన్నారు.
రోహిత్ శర్మకు అవమానం
ప్రస్తుత వన్డే జట్టు పరిస్థితిపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. తుది జట్టు (ప్లేయింగ్ ఎలెవన్) ఎంపికలో నిరంతరం తప్పులు జరుగుతున్నాయని విమర్శించారు. దీనివల్ల తనకు వన్డే క్రికెట్ చూడాలనే ఆసక్తి కూడా తగ్గుతోందని ఆయన అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. “ఒక టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌ను అకస్మాత్తుగా కొత్త కెప్టెన్‌తో భర్తీ చేయడం అనవసరం. నేను రోహిత్‌తో కలిసి ఆడాను. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ మొత్తం వ్యవహారం జరిగిన తీరు నాకు ఏమాత్రం నచ్చలేదు. క్రికెట్ ప్రపంచానికి ఎంతో అందించిన ఒక క్రికెటర్‌ను ఇది అవమానించినట్లుగా అనిపిస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.