KKR vs SRH Qualifier 1: సన్ రైజర్స్ ఫ్లాప్ షో… ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్ లో కోల్ కతా 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసింది. లీగ్ స్టేజ్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది. భారీస్కోర్లతో సత్తా చాటిన కమ్మిన్స్ అండ్ కో క్వాలిఫయర్ లో మాత్రం చేతులెత్తేసింది
- By Praveen Aluthuru Published Date - 11:15 PM, Tue - 21 May 24

KKR vs SRH Qualifier 1: ఐపీఎల్ 17వ సీజన్ లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్ లో కోల్ కతా 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసింది. లీగ్ స్టేజ్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది. భారీస్కోర్లతో సత్తా చాటిన కమ్మిన్స్ అండ్ కో క్వాలిఫయర్ లో మాత్రం చేతులెత్తేసింది. అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేదు.
ట్రావిడ్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ నిరాశపరిచారు. ఫలితంగా కేవలం 39 పరుగులక 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాహుల్ త్రిపాఠీ, క్లాసెన్ ఆదుకోకుంటే సన్ రైజర్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. వీరిద్దరూ ఐదో వికెట్ కు 62 పరుగులు జోడించారు. త్రిపాఠీ హాఫ్ సెంచరీ చేయగా.. క్లాసెన్ 32 పరుగులు చేశాడు. చివర్లో ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ధాటిగా ఆడి 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. కోల్ కతా బౌలర్లలో మిఛెల్ స్టార్క్ 3 , వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా… వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు.
ఛేజింగ్ లో కోల్ కతాకు ఓపెనర్లు నరైన్, గుర్బాజ్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. సన్ రైజర్స్ బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో కోల్ కతా టార్గెట్ ఛేదించేందుకు పెద్దగా కష్టపడలేదు. తొలి వికెట్ కు నరైన్, గుర్బాజ్ 44 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔటైనప్పటకీ వెంకటేశ్ అయ్యర్ , శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. సన్ రైజర్స్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, ఫీల్డింగ్ లో పలు తప్పిదాలు మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేశాయి. ఫలితంగా కోల్ కతా నైట్ రైడర్స్ 13.4 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ 28 బంతుల్లో 5 ఫోర్లు,4 సిక్సర్లతో 51 , కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. కాగా ఈ మ్యాచ్ లో ఓడినప్పటకీ సన్ రైజర్స్ కు మరో అవకాశం ఉంది. రాజస్థాన్, బెంగళూరు మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో రెండో క్వాలిఫయర్ లో సన్ రైజర్స్ తలపడుతుంది.
Also Read: IPL Qualifier 1: ఆదుకున్న త్రిపాఠీ, క్లాసెన్, కమ్మిన్స్.. కోల్‌కతా ముందు ఈజీ టార్గెట్