Sanju Samson: సంజూ శాంసన్ కు నిలకడ లేదు
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ యువ క్రికెటర్ సంజూ శాంసన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
- Author : Naresh Kumar
Date : 15-06-2022 - 2:33 IST
Published By : Hashtagu Telugu Desk
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ యువ క్రికెటర్ సంజూ శాంసన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంజూ ఒకటి రెండు మ్యాచ్‌ల్లో బాగా ఆడుతాడని.. ఆ తర్వాత అదే స్థిరమైన ప్రదర్శన కొనసాగించడంలో విఫలమవుతాడని పేర్కొన్నాడు. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని చూస్తే జట్టులో యువ ఆటగాళ్లకు కొదువలేదనీ అన్ని విభాగాల్లోకెల్లా మనకు నలుగురు వికెట్ కీపర్లు అందుబాటులో ఉంటారనీ కపిల్ చెప్పాడు. సంజూ శాంసన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తిక్, ఇషాన్ కిషన్..విడివిడిగా చూస్తే ఈ నలుగురు ఎవరికి వారే అద్భుతంగా ఆడతారన్నాడు. బ్యాటింగ్, కీపింగ్ చేయడంలో మంచి నైపుణ్యం కలిగినవారన్నాడు. తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉందనీ చెప్పుకొచ్చాడు. అయితే తన దృష్టిలో ఒక వికెట్ కీపర్ మాత్రం నిలకడ చూపించలేకపోతున్నాడనీ కపిల్ వ్యాఖ్యానించాడు.
సంజూ శాంసన్ చాలా టాలెంట్ ఉన్న ఆటగాడనీ ఒకటి, రెండు మ్యాచ్‌లు ఆడి తర్వాత ఫెయిలవుతాడనీ, అతనికి నిలకడ లేదని కపిల్ అన్నాడు.ఇదొక్కటే అతనిలో ఉన్న మైనస్ పాయింట్ అని చెప్పుకొచ్చాడు. దీనిని సంజూ అధిగమించాలని సూచించాడు. నిజానికి ప్రతి ఏటా ఐపీఎల్‌లో ఇరగదీసే శాంసన్‌కు టీమిండియాలో ఇప్పటికే పలుసార్లు ఛాన్స్ వచ్చింది. అయితే ఆ అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇండియా తరఫున 13 టీ ట్వంటీలు ఆడి కేవలం 174 రన్స్ చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించినా.. అతనికి సెలక్టర్లు ఛాన్స్ ఇవ్వలేదు.