Jr Malinga IPL: చెన్నై జట్టులోకి జూనియర్ మలింగా
ప్రస్తుత ఐపీఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములతో ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
- By Naresh Kumar Published Date - 11:51 PM, Thu - 21 April 22

ప్రస్తుత ఐపీఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములతో ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. గాయాల కారణంగా స్టార్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్, న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ఆడమ్ మిల్నే ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకున్నారు. అయితే టోర్నీ నుంచి తప్పుకున్న ఆడమ్ మిల్నే స్థానంలో శ్రీలంక యువ పేసర్ మతీష పతిరనని జట్టులోకి తీసుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. యార్కర్ల కింగ్స్ లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్‌ని తలపించే మతీష పతిరన.. శ్రీలంక జట్టు తరఫున అండర్-19 విభాగంలో దుమ్మురేపుతున్నాడు..
ఈ క్రమంలోనే అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకుంది. మిల్నే స్థానాన్ని భర్తీ చేస్తాడని సీఎస్‌కే అతనిపై భారీ అంచనాలు పెట్టుకుంది. ప్రస్తుతం చక్కటి ఫామ్ లో ఉన్న మతీష పతిరన త్వరలోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇదిలాఉంటే ఐపీఎల్ 15వ సీజన్ లో ఈ సీజన్‌లో ఇప్పటికే ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్.. కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. వచ్చే నెల 22 వరకూ ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు జరగనుండగా.. అప్పటికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి చేరుకుంటాయి. ఈ క్రమంలో ఇక మిగిలిన 8 మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిస్తే తప్పా చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కి చేరుకునే అవకాశం లేదు.