గాయాలతో ఐపీఎల్‌కు దూరమవుతున్న ఆటగాళ్లు!
రోహిత్ శర్మ గాయంతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. యువ స్పిన్ ఆల్ రౌండర్ అథర్వ అంకోలేకర్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
- Author : Gopi
Date : 17-04-2026 - 11:27 IST
Published By : Hashtagu Telugu Desk
IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తమ సత్తా చాటాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. 2025 సీజన్ వైఫల్యం తర్వాత, ఈసారి పక్కా ప్రణాళికతో జట్టును పునర్నిర్మించారు. మొదటి ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, సిఎస్కె మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్, డెవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే రాణించడంతో 192 పరుగులు సాధించారు. అన్షుల్ కాంబోజ్, స్పిన్నర్లు కేకేఆర్ బ్యాటర్లను కట్టడి చేసి విజయాన్ని అందించారు. అయితే ఏప్రిల్ 14న ఒక చేదు వార్త అభిమానులను నిరాశకు గురిచేసింది.
సిఎస్కె పేస్ విభాగానికి నాయకుడిగా ఉన్న ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీపక్ చాహర్ స్థానాన్ని భర్తీ చేయడానికి 2025 వేలంలో రూ. 4.8 కోట్లకు సిఎస్కె ఇతనిని కొనుగోలు చేసింది. గత సీజన్లో 15 వికెట్లు తీసి నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఖలీల్.. ఈ సీజన్లో కూడా అద్భుతంగా ఆరంభించాడు. కేకేఆర్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లో సునీల్ నరైన్ వికెట్ తీసి 1/24 గణాంకాలతో ఆకట్టుకున్నాడు. కానీ గాయం కారణంగా ఆయన దూరం కావడం జట్టుకు పెద్ద లోటు.
Also Read: Donald Trump: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా గాయాల బెడద తప్పడం లేదు. ఇంగ్లాండ్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ డేవిడ్ పేన్ చీలమండ గాయం కారణంగా ఐపీఎల్ 2026 నుండి తప్పుకున్నాడు. జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో రూ. 1.5 కోట్లకు జట్టులోకి వచ్చిన పేన్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆర్సీబీపై 2/35తో తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్‌పై 57 పరుగుల భారీ విజయం తర్వాత ఏప్రిల్ 18న ఉప్పల్ స్టేడియంలో సిఎస్కెతో తలపడనుంది.
ముంబై ఇండియన్స్‌కు మరో షాక్
రోహిత్ శర్మ గాయంతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. యువ స్పిన్ ఆల్ రౌండర్ అథర్వ అంకోలేకర్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. రూ. 30 లక్షలకు ముంబై ఇతనిని దక్కించుకుంది. అథర్వ స్థానంలో క్రిష్ భగత్ ను రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి తీసుకుంది.