Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 20-06-2026 - 1:43 IST
Published By : Hashtagu Telugu Desk
ఫేస్బుక్ ప్రేమ, మతాంతర వివాహం, కిడ్నాప్ కేసులతో జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన కుంభమేళా మోనాలిసా ఉదంతంలో కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దలను ఎదిరించి ముస్లిం యువకుడిని పెళ్లాడిన తనకు పుట్టింటివారి నుంచి తీవ్ర ప్రాణహాని ఉందంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. పిటిషన్ తేలేవరకు ఆమె ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించాలని కేరళ పోలీసులను ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లో భర్తపై నమోదైన పోక్సో, కిడ్నాప్ కేసుల నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన ఈ రక్షణ ఉత్తర్వులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అయిన కుంభమేళా మోనాలిసా ఉదంతం ఇప్పుడు ఒక పెద్ద చట్టపరమైన, దౌత్యపరమైన మలుపు తిరిగింది. మతాంతర వివాహం చేసుకున్న తనకు, తన భర్తకు తీవ్ర ప్రాణహాని ఉందంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రిట్ పిటిషన్‌పై తుది నిర్ణయం వచ్చేంత వరకు సదరు యువతికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిందిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జులై 10వ తేదీకి వాయిదా వేసింది.
ఫేస్బుక్ ప్రేమ.. ఆలయంలో మతాంతర వివాహం!
కుంభమేళాలో వ్లాగర్లు తీసిన ఫోటోలు, వీడియోలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మోనాలిసాకు.. మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో గతంలో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు ఎనిమిది నెలల పాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట.. ఇరు వర్గాల మతాలు వేరైనప్పటికీ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయంలో వీరిద్దరూ సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచి ఈ కొత్త జంట కేరళలోనే నివాసం ఉంటున్నారు.
రంగంలోకి మధ్యప్రదేశ్ పోలీస్.. పోక్సో కేసు నమోదు!
అయితే మోనాలిసా వివాహం చేసుకున్న తర్వాత ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇంకా మైనర్ అని, ఆమెను ఫర్మాన్ ఖాన్ అపహరించాడంటూ మధ్యప్రదేశ్‌లోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్ ఖాన్‌పై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలోనే తమను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని, మరోవైపు తమ ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందంటూ మోనాలిసా కేరళ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించిన కేరళ హైకోర్టుకు చెందిన మరో ధర్మాసనం ఈ నెల ప్రారంభంలోనే నిందితుడిగా ఉన్న భర్త ఫర్మాన్ ఖాన్‌కు పెద్ద ఊరటనిచ్చింది. కిడ్నాప్, పోక్సో కేసులలో ముందస్తు బెయిల్ పొందేందుకు వీలుగా, మధ్యప్రదేశ్ కోర్టును ఆశ్రయించడానికి అతనికి నెల రోజుల పాటు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ గడువు లోపు అతను మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.