IPL Auction 2022 : వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ టార్గెట్ వీళ్ళే
ఐపీఎల్ మెగా 2022 వేలంకు ముందు ఫ్రాంచైజీలన్నీ తమ తుది జట్లపై ఓ అంచనాకు వస్తున్నాయి.
- By Hashtag U Published Date - 01:19 PM, Wed - 9 February 22

ఐపీఎల్ మెగా 2022 వేలంకు ముందు ఫ్రాంచైజీలన్నీ తమ తుది జట్లపై ఓ అంచనాకు వస్తున్నాయి. ఆ అంచనా ఆధారంగానే వేలంలో జట్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. గతేడాది ఉన్న ఆటగాళ్లలో ఈ సారి కోల్‌కతా నైట్‌రైడర్స్ నలుగురిని రిటైన్ చేసుకుంది. ఈ జాబితాలో ఆండ్రీ రసెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్ , సునీల్ నరైన్ కు చోటు దక్కింది. ఇందుకుగాను కేకేఆర్ యాజమాన్యం రసెల్‌కు రూ.12 కోట్లు, వరుణ్ చక్రవర్తి రూ.8 కోట్లు, వెంకటేశ్ అయ్యర్ కు రూ.8 కోట్లు, సునీల్ నరైన్‌కు రూ.6 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రూ.90 కోట్లకు గాను కేకేఆర్ దగ్గర ఇంకా రూ.48 కోట్ల రూపాయలు వేలానికి మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2022 మెగా వేలంలోకోల్‌కతా నైట్‌రైడర్స్ టార్గెట్ చేసే ఆటగాళ్లపై ఆసక్తి నెలకొంది. ఓపెనింగ్ స్థానానికి సంబంధించి వెంకటేశ్ అయ్యర్ కు జోడీగా .. క్వింటన్ డికాక్, క్రిస్ లిన్, ఇషాన్ కిషన్ , డేవిడ్ వార్నర్‌లను కోల్ కతా ఫ్రాంచైజీ టార్గెట్ చేసింది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ తో పాటు కెప్టెన్ గా వ్యవహరించే సత్తా ఉన్న శ్రేయస్ అయ్యర్‌పై కేకేఆర్ కన్నేసింది. వేలంలో అయ్యర్ కోసం ఎంత ధరనైనా చెల్లించేందుకు సిద్దంగా ఉంది. అలాగే కేకేఆర్ మాజీ ఆటగాళ్లు దినేష్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి,తో పాటుగా యువ హిట్టర్ షారూఖ్ ఖాన్‌లను కూడా తీసుకోవాలని కేకేఆర్ భావిస్తోంది. అటు ఆల్‌రౌండర్లుగా సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్‌లు ఉన్న నేపథ్యంలో కేకేఆర్.. వారికి బ్యాకప్ ఆప్షన్స్‌పై దృష్టిసారించనుంది. ఈ స్లాట్ కోసం దేశవాళీ ఆల్‌రౌండర్లను తీసుకునే అవకాశముంది… ఇక వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ రూపంలో జట్టుకు ఇద్దరూ క్వాలిటీ స్పిన్నర్లున్న కారణంగా. వారికి బ్యాకప్‌గా అశ్విన్, చావ్లాలను తీసుకునే అవకాశముంది. ఇక పేసర్లుగా కగిసో రబడా, మహమ్మద్ షమీ, ట్రెంట్ బౌల్ట్, లూకీ ఫెర్గూసన్‌లను కేకేఆర్ టార్గెట్ చేసింది. వీరితో పాటుగా దేశవాళీ స్టార్లు శివం మావి, చేతన్ సకారియాలను కూడా కొనుగోలు చేసేందుకు సన్నద్ధమైంది. అయితే కోల్ కతా పలువురు స్టార్ ప్లేయర్స్ కోసం ప్రయత్నించే ఆలోచనలో ఉండగా… మిగిలిన ఫ్రాంచైజీలతో హోరాహోరీ పోటీ నెలకొంటుందని చెప్పొచ్చు.