Harika: పాపకు జన్మనిచ్చిన ద్రోణవల్లి హారిక
భారత చెస్ క్రీడాకారిణి, తెలుగుతేజం ద్రోణవల్లి హారిక పండంటి పాపకు జన్మనిచ్చింది.
- Author : Naresh Kumar
Date : 25-08-2022 - 9:01 IST
Published By : Hashtagu Telugu Desk
భారత చెస్ క్రీడాకారిణి, తెలుగుతేజం ద్రోణవల్లి హారిక పండంటి పాపకు జన్మనిచ్చింది. తనకు పాప పుట్టిందన్న గుడ్‌న్యూస్‌ను హారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. లిటిల్ ప్రిన్సెస్‌కు స్వాగతం అంటూ ట్వీట్‌లో పేర్కొంది. ఇటీవల చెస్ ఒలింపియాడ్‌లో 9 నెలల గర్భంతోనే పాల్గొన్న హారిక ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో కాంస్య పతకం గెల్చుకుంది.
9 నెలల గర్భిణీ కావడంతో ఒక దశలో టోర్నీలో పాల్గొనడం సందేహంగా మారింది.
అయితే హారిక వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంది. దీనికి తోడు చెస్ ఒలింపియాడ్ చెన్నైలో జరగడం ఈ స్టార్‌ప్లేయర్‌కు బాగా కలిసొచ్చింది. సుమారు18 ఏళ్ల క్రితం 13 ఏళ్ల వయసులో భారత మహిళల చెస్ టీమ్ తరఫున తొలి సారి ఆడానని అప్పుడు హారిక గుర్తు చేసుకుంది. మన దేశం తరఫున మెడల్ సాధించి పోడియంపై నిలవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నానని, చివరకు ఇది సాకారమైందని పతకం గెలిచిన తర్వాత వ్యాఖ్యానించింది. పైగా తాను 9 నెలల గర్భంతో ఉన్నప్పుడు ఈ ఘనత సాధించడం ఎంతో ఉద్వేగంగా ఉందని చెప్పింది.
చెస్ టోర్నమెంట్లో ఆటపై దృష్టి సారిస్తూనే డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు పాటించానని తెలిపింది. 9 నెలల గర్భంతోనే చెస్ ఆడి మెడల్ గెలిచిన హారిక అంకిత భావం, నిబద్ధతపై ప్రశంసల జల్లు కురిసింది. చెస్ ఒలింపియాడ్ మెడల్ గెలిచిన ఆనందం ఇప్పుడు పాపకు జన్మనివ్వడంతో అది రెట్టింపైందని చెప్పొచ్చు.
— Harika Dronavalli (@HarikaDronavali) August 24, 2022