India vs Pakistan : ఇండియా వర్సెస్ పాక్.. 60ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అమీతుమీ
India vs Pakistan : భారత్ - పాక్ మ్యాచ్ అంటే క్రీడా ప్రియులకు ఎంతో ఆసక్తి ఉంటుంది.
- Author : Pasha
Date : 03-02-2024 - 8:47 IST
Published By : Hashtagu Telugu Desk
India vs Pakistan : భారత్ – పాక్ మ్యాచ్ అంటే క్రీడా ప్రియులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. క్రికెట్ ఒక్కటే కాదు.. ఇరు జట్ల మధ్య ఆట ఏదైనా సరే ఉద్వేగం, ఉత్సాహం మాత్రం దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. అలాంటిది పాకిస్థాన్ గడ్డపై సుదీర్ఘ విరామం తర్వాత భారత్ ఆడుతుంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కచ్చితంగా ఈ పోటీ క్రీడాప్రియులకు పండుగ వాతావరణాన్ని అందిస్తుంది. అయితే ఇప్పుడు డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీ కోసం చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌తో సమరానికి సై అంటోంది భారత్. పాక్ గడ్డపై 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెన్నిస్ జట్టు అడుగుపెట్టింది. డేవిస్ కప్ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ, రేపు(3, 4 తేదీల్లో) పాకిస్తాన్‌తో ఇండియా(India vs Pakistan) తలపడనుంది.
We’re now on WhatsApp. Click to Join
ఇప్పటివరకు పాక్ జట్టుతో ఏడుసార్లు తలపడిన భారత్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. గ్రాస్ కోర్టులో జరుగుతున్న ఈ పోరులో ఇప్పుడు భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. చివరిసారిగా 1964లో పాకిస్థాన్‌లో ఆడినప్పుడు భారత్ 4-0తో ఘన విజయం సాధించింది. ఇక 2019లో తటస్థ వేదికలో ఆడినప్పుడు ఆఖరిగా అంతే తేడాతో దాయాదిని ఓడించింది. అయితే ఈసారి పాక్‌ను తక్కువ అంచనా వేయలేం. పాక్ టీమ్‌లో అసిమ్ ఖురేషి, అకీల్ ఖాన్ రూపంలో అనుభవజ్ఞులైన ప్లేయర్స్ ఉన్నారు. ఇవాళ(శనివారం) జరిగే తొలి సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌తో అసిమ్ ఖురేషి, రెండో సింగిల్స్‌లో శ్రీరామ్ బాలాజీతో అకీల్ ఖాన్ పోటీపడనున్నారు. రేపు (ఆదివారం) జరిగే డబుల్స్‌లో సాకేత్ మైనేని-యుకి బాంబ్రి ద్వయం బర్కతుల్లా-ముజామిల్ మొర్తజాతో తలపడనున్నారు. అదే రోజు రివర్స్ సింగిల్స్‌లో రామ్‌కుమార్‌తో అకీల్, శ్రీరామ్‌తో ఖురేషి తలపడతారు. ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ను నేరుగా ఎంపిక చేసిన 500 మంది అతిథులు, అభిమానులు మాత్రమే చూడబోతున్నారు. నికీ పూంచా రూపంలో మరో సింగిల్స్ ప్లేయర్ అందుబాటులో ఉన్నప్పటికీ గ్రాస్ కోర్టులో అతడి కన్నా బాలాజీనే బెటర్ అని ఇండియా టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది.
Also Read : DSC – TET : డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లపై క్లారిటీ.. రెండేళ్లు ‘అప్రెంటిస్‌షిప్’
- సోనీ లివ్‌లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ డేవిస్ కప్ మ్యాచ్‌ను లైవ్‌లో చూడొచ్చు.
- సోనీ టెన్ ఛానెల్‌లు కూడా భారత్ వర్సెస్ పాకిస్థాన్ డేవిస్ కప్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.