India vs Newzealand 2nd Test: న్యూజిలాండ్ 255 కి ఆలౌట్.. భారత్ టార్గెట్ 359
- By Kode Mohan Sai Published Date - 11:31 AM, Sat - 26 October 24

India vs Newzealand 2nd Test: పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో, న్యూజిలాండ్ టీమ్ భారత్‌కు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు, 198/5తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్, భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దెబ్బకు వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఫలితంగా, వారు 255 పరుగులకే కుప్పకూలారు. దీంతో, తొలి ఇన్నింగ్స్‌లో పొందిన 103 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని, భారత్ ముందు 359 పరుగుల లక్ష్యం ఉంచింది. మ్యాచ్‌లో ఇంకా రెండున్నర రోజుల ఆట మిగిలి ఉండగా, తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైన భారత్, లక్ష్య ఛేదనలో ఎలా ఆడుతుందో చూడాలి.
మ్యాచ్‌లో శుక్రవారం బౌలింగ్‌లో నిరాశ పరిచిన రవీంద్ర జడేజా, ఈరోజు మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను కోలుకోనివ్వలేదు. అతనికి తోడుగా అశ్విన్ (రెండు వికెట్లు) మరియు వాషింగ్టన్ సుందర్ (నాలుగు వికెట్లు) క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో, న్యూజిలాండ్ జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఓవరాల్‌గా, న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్ 86 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఆఖరి ముగ్గురు బ్యాటర్లు శాంట్నర్ (4), సౌథీ (0), అజాజ్ పటేల్ (1) జడేజా దెబ్బకు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు.