India vs South Africa, 4th T20: అవేశ్‌ఖాన్ అదుర్స్…సిరీస్ సమం
విశాఖ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాజ్‌కోట్‌లోనూ టీమిండియా అదరగొట్టింది.
- By Naresh Kumar Published Date - 10:54 PM, Fri - 17 June 22

విశాఖ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాజ్‌కోట్‌లోనూ టీమిండియా అదరగొట్టింది. మరోసారి సమిష్టిగా రాణించిన బౌలర్లు సఫారీలకు చెక్ పెట్టారు. ఈసారి భారీ విజయంతో లెక్క సరి చేశారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు సరైన ఆరంభాన్నివ్వలేకపోయారు. గత మ్యాచ్‌లో అదరగొట్టిన రుతురాజ్ 5 రన్స్‌కే ఔటవగా.. ఇషాన్ కిషన్ 27 పరుగులు చేశాడు.
శ్రేయాస్ అయ్యర్ కూడా నిరాశపరచగా… పంత్ 17 పరుగులకే ఔటయ్యాడు. దీంతో 81 పరుగులకే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హార్థిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించాడు. పాండ్యా 31 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేయగా… దినేశ్ కార్తీక్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. డీకే జోరుతోనే భారత్ 169 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీసుకోగా.. జాన్సెన్, ప్రిటోరియస్, నోర్జే, మహారాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
170 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను ఆరంభం నుంచే భారత బౌలర్లు దెబ్బతీశారు. గత మ్యాచ్‌లలో ఏమాత్రం ఆకట్టుకోని అవేశ్‌ఖాన్ రాజ్‌కోట్‌లో మాత్రం చెలరేగిపోయాడు. ప్రిటోరియస్, డస్సెన్‌లను ఔట్ చేసి ఒత్తిడి పెంచాడు. కెప్టెన్ బవుమా రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. భారత బౌలర్లు మిగిలిన బ్యాటర్లలో ఏ ఒక్కరినీ క్రీజులో కుదురుకోనివ్వలేదు. దీంతో సౌతాఫ్రిరా 16.5 ఓవర్లలో కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికాకు టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్. గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా.. మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డుసెన్ మాత్రమే 20 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అవేష్ 4, చహల్ 2, హర్షల్, అక్షర్ చెరొక వికెట్ తీశారు. గత మూడు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయని అవేశ్ ఖాన్ 18 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టీ ట్వంటీ ఆదివారం బెంగళూరు వేదికగా జరుగుతుంది.
Photo Courtesy: BCCI/Twitter.
Clinical win for #TeamIndia in Rajkot! 👏 👏
The @RishabhPant17-led unit beat South Africa by 82 runs to level the series 2-2. 🙌 🙌
Scorecard ▶️ https://t.co/9Mx4DQmACq #INDvSA | @Paytm pic.twitter.com/fyNIlEOJWl
— BCCI (@BCCI) June 17, 2022
Related News

VVS Laxman:కోచ్ గా లక్ష్మణ్ కొనసాగింపు
బిజీ క్రికెట్ షెడ్యూల్ లో పలు సార్లు ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తుంటారు.