Virat Kohli Resignation : వేటును ఊహించే కోహ్లీ రాజీనామా
భారత క్రికెట్ లో గత కొంత కాలంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించే చర్చ జరుగుతోంది.
- By Hashtag U Published Date - 01:01 PM, Fri - 21 January 22

భారత క్రికెట్ లో గత కొంత కాలంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించే చర్చ జరుగుతోంది. టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు మొదలైన కెప్టెన్సీ రాజీనామా రగడ ఇటీవల సౌతాఫ్రికా టూర్ వరకూ కొనసాగుతూనే ఉంది. పేలవ ఫామ్, వరుస ఓటములు , బోర్డుతో చెడిన సంబంధాలు…కారణాలు ఏదైతేనేం భారత క్రికెట్ లో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ కు తెరపడింది. టీ ట్వంటీ ఫార్మేట్ లో తనంతట తానే తప్పుకోగా.. వన్డే కెప్టెన్సీ నుండి సెలక్టర్లు తప్పించారు. ఇక సఫారీ గడ్డపై సిరీస్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకోవడంతో కోహ్లీ తన టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా రోజుకో ఆసక్తికర విషయం బయటకొస్తూనే ఉంది. తాజాగా కోహ్లీ కెప్టెన్సీకి సంబంధించి బోర్డు సభ్యుడు ఒకరు కీలక విషయాలు వెల్లడించాడు. నిజానికి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత కోహ్లీ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసి ఉండకపోతే… బీసీసీఐనే వేటు వేసేదని ఆ బోర్డు సభ్యుడు చెప్పుకొచ్చాడు.
దీని వెనుక చాలా కారణాలున్నాయని చెప్పాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు జరిగిన పరిణామాలు , సౌతాఫ్రికా టూర్ కు ముందు బీసీసీఐపై పరోక్షంగా కోహ్లీ చేసిన వ్యాఖ్యలు కూడా కారణంగా చెప్పుకొచ్చాడు. అలాగే సిరీస్ ఓటమి మరో ప్రధాన కారణమైందన్నాడు. ఒకవేళ కోహ్లీ తప్పుకోకుంటే బోర్డు వేటు వేసే పరిణామాలు ఉండేవని, అదే జరిగితే విరాట్ కు అంతకంటే అవమానం మరొకటి లేదని వ్యాఖ్యానించాడు. వన్డే కెప్టెన్సీ విషయంలోనే తీవ్రంగా నొచ్చుకున్న కోహ్లీ ఈ పరిణామాన్ని ముందే ఊహించే తప్పుకోవడం మంచిదైందని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డాడు.
నిజానికి భారత జట్టులో ఫార్మేట్ కో కెప్టెన్ వర్కౌట్ కాదనేది చాలా మంది వాదన. బీసీసీఐలో కూడా స్ప్లిట్ కెప్టెన్సీకి చాలా మంది వ్యతిరేకంగా ఓటేశారని ఆ బోర్డు సభ్యుడు వెల్లడించాడు. జట్టులో గ్రూపులు తయారయ్యే ప్రమాదం ఉంటుందని, దీని వల్ల చాలా సమస్యలు వచ్చేవన్నాడు. ఇదిలా ఉంటే సౌతాఫ్రికా టూర్ కు ముందు మీడియా సమావేశంలో కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ పెద్దల్లో ఎక్కువమంది ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపాడు. ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడి ఉంటే బావుండేదని, పరోక్షంగా ప్రెసిడెంట్ పై విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడినట్టు చెప్పాడు.