టీ20 వరల్డ్ కప్ 2026లో మ్యాచ్ ఫిక్సింగ్?!
కెనడా క్రికెట్ బోర్డు ప్రతిష్ఠ పరిపాలనా స్థాయిలో కూడా దిగజారింది. మాజీ సీఈఓ సల్మాన్ ఖాన్ పై మోసం, దొంగతనం కేసులు నడుస్తున్నాయి.
- Author : Gopi
Date : 17-04-2026 - 1:22 IST
Published By : Hashtagu Telugu Desk
Match-Fixing: కెనడా క్రికెట్ జట్టుపై ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ రెండు భారీ విచారణలను ప్రారంభించింది. సీబీసీ రూపొందించిన కరప్షన్, క్రైమ్ అండ్ క్రికెట్ అనే డాక్యుమెంటరీలో చేసిన కొన్ని సంచలన ఆరోపణలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విచారణలో అత్యంత కీలకమైన భాగం భారత్, శ్రీలంక వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 నాటి ఒక మ్యాచ్కు సంబంధించి ఉండటం గమనార్హం. న్యూజిలాండ్ వర్సెస్ కెనడా మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.
విచారణ నీడలో ఆ 5వ ఓవర్
న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా వేసిన 5వ ఓవర్ ప్రస్తుతం ఐసీసీ నిఘాలో ఉంది. టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి కేవలం మూడు వారాల ముందే బజ్వాను కెనడా జాతీయ జట్టుకు కెప్టెన్గా నియమించారు. ఆ ఓవర్లో బజ్వా నో-బాల్స్, వైడ్ బాల్స్ వేస్తూ ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. ఇది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. ఆ ఓవర్లో బౌలింగ్ నిజంగానే పేలవంగా సాగిందా లేదా కెప్టెన్ కావాలనే పరుగులు ఇచ్చాడా? దీని వెనుక ఏవైనా బెట్టింగ్ ముఠాల హస్తం ఉందా? అనే కోణంలో ఐసీసీ ఆరా తీస్తోంది.
లీక్ ఆడియోతో మొదలైన కలకలం
కెనడా క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఆటగాళ్లపై వస్తున్న అవినీతి ఆరోపణలతో పాటు, టీమ్ సెలక్షన్లో జరిగిన అక్రమాలకు సంబంధించి కొన్ని టెలిఫోన్ రికార్డింగ్లు బయటకు వచ్చాయి. మాజీ కోచ్ ఖుర్రం చౌహాన్ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. అందులో కొంతమంది ప్రత్యేక ఆటగాళ్లను మాత్రమే జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలని బోర్డు సీనియర్ సభ్యులు తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు.
Also Read: ఫ్రీజర్ కాయిన్ ట్రిక్.. ప్రమాదాన్ని ముందే పసిగడుతుంది!
మరో మాజీ కోచ్ పుబుదు దస్సానాయకే కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 వరల్డ్ కప్ సమయంలో టీమ్ సెలక్షన్లో ఇతర అధికారుల జోక్యాన్ని తాను వ్యతిరేకించానని, దాంతో తనను ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించారని ఆయన పేర్కొన్నారు.
పరిపాలనా పరంగా కునారిల్లుతున్న కెనడా క్రికెట్
కెనడా క్రికెట్ బోర్డు ప్రతిష్ఠ పరిపాలనా స్థాయిలో కూడా దిగజారింది. మాజీ సీఈఓ సల్మాన్ ఖాన్ పై మోసం, దొంగతనం కేసులు నడుస్తున్నాయి. మరోవైపు కెనడా క్రికెటర్ల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. వారికి వరల్డ్ కప్ ఆడటం వల్ల రావాల్సిన పారితోషికాలు అందడంలో జాప్యం జరగడమే కాకుండా వారికి ఎలాంటి ప్రొఫెషనల్ కాంట్రాక్టులు కూడా లేకపోవడం గమనార్హం.