Harman Preet Kaur: నా కన్నీళ్లు దేశం చూడొద్దనుకున్నా: హర్మన్ ప్రీత్ కౌర్
మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ లో గెలిచి మ్యాచ్ లో భారత్ ఓడిపోవడం అభిమానులను నిరాశ పరిచింది.
- By Maheswara Rao Nadella Published Date - 08:00 PM, Fri - 24 February 23

మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ లో గెలిచి మ్యాచ్ లో భారత్ ఓడిపోవడం అభిమానులను నిరాశ పరిచింది. ఆరంభంలో తడబడి తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harman Preet Kaur) హాఫ్ సెంచరీతో గెలుపు ముంగిట నిలిచింది. అయితే అనూహ్యంగా ఆమె రనౌట్ భారత్ ఓటమికి కారణమయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కన్నీటి పర్యంతమయింది. అయితే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో హర్మన్ ప్రీత్ కౌర్ కళ్లద్దాలు పెట్టుకుని వచ్చి మాట్లాడడం చర్చనీయాంశమైంది. దీనిపై ప్రెస్ మీట్ లో హర్మన్ ప్రీత్ కౌర్ (Harman Preet Kaur) వివరణ ఇచ్చింది. ఈ ఓటమిని తాను తట్టుకోలేక పోయాననీ, అందుకే కన్నీళ్లు పెట్టుకున్నాననీ చెప్పింది. తన కన్నీళ్లను భారత అభిమానులు చూడకూడదనే తాను కళ్లజోడు పెట్టుకున్నట్లు ఆమె వివరించింది. నేను కన్నీళ్లు పెట్టుకోవడం నా దేశం చూడడం నాకు ఇష్టంలేదు. అందుకే కళ్లద్దాలు ధరించాను. నేను మాట ఇస్తున్నా ఇకముందు మేం మరింత మెరుగ్గా ఆడతాం. ఇంకోసారి దేశాన్ని ఇలా నిరాశపరచమని చెప్పుకొచ్చింది.
తన రనౌట్ అయిన విధానం కన్నా దురదృష్టం ఇంకొకటి ఉండదనీ ఆమె వ్యాఖ్యానించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి బంతి వరకు పోరాడాలని ముందే అనుకున్నట్టు చెప్పింది. అయితే ఫలితం తమకు అనుకూలంగా రాలేదనీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని తమకి తెలుసనీ చెప్పిన హర్మన్ జెమీమా బ్యాటింగ్ పై ప్రశంసలు కురిపించింది. ఈ టోర్నీలో జట్టు ఆటతీరు గురించి సంతృప్తి వ్యక్తం చేసింది. కాగా మ్యాచ్ లో కీలక సమయంలో రనౌట్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ తన ఆవేశాన్ని, బాధను, కోపాన్ని దాచుకోలేకపోయింది. ఔటయ్యాక తన ఫ్రస్టేషన్ ను మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్ లోనూ చూపించి బ్యాట్ ను విసిరికొట్టింది.
Also Read: Blood: ఈ ఆహార పదార్థాలు తింటే మీ రక్తం శుద్ధి అవుతుంది, హిమోగ్లోబిన్ లెవెల్ కూడా పెరుగుతుంది