Hahare Water Crisis:నీటిని వృథా చేయొద్దు..భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆదేశం
జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లకు అనుకోని ఇబ్బంది వచ్చి పడింది.
- By Naresh Kumar Published Date - 02:08 PM, Tue - 16 August 22

జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లకు అనుకోని ఇబ్బంది వచ్చి పడింది. ప్రస్తుతం అక్కడ నీటి కొరత ఉండడంతో భారత జట్టుపైనా ఆ ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ఆదేశాలిచ్చింది.బాత్‌రూముల్లో గంటలకు గంటలు ఉంటూ నీటిని వృథా చేయవద్దంటూ కీలక సూచన చేసింది. ఐదు నిమిషాల్లో స్నానం ముగించుకుని రావాలని, నీటిని కాపాడాలని సూచించింది. జింబాబ్వేలో ప్రస్తుతం నీటి కొరత తీవ్రంగా ఉంది.
ముఖ్యంగా వన్డే సిరీస్ జరగాల్సి ఉన్న ఆ దేశ రాజధాని హరారేలో వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వస్తుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్పందించిన బీసీసీఐ ఆటగాళ్ళకు సూచనలు చేసింది. క్రికెటర్లందరూ నీటిని జాగ్రత్తగా వాడానలి సూచించామనీ, తక్కువ సమయంలోనే స్నానాలను పూర్తి చేసుకోవాలని చెప్పినట్టు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. నీటి కొరత కారణంగా స్విమ్మింగ్ పూల్స్ లో స్నానాలు చేయడం కూడా రద్దు చేసినట్టు తెలిపారు. భారత క్రికెట్ జట్టుకు విదేశీ పర్యటనల్లో ఇలా నీటి కొరత ఎదురవడం గతంలోనూ జరిగింది. 2018లో దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడూ ఇదే పరిస్థితి తలెత్తింది. కానీ అప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి క్రికెటర్ల అవసరాలను తీర్చారు. అయితే ఇప్పటికే జింబాబ్వే చేరుకున్న టీమిండియా క్రికెటర్లు.. తాము ప్రజల నీటి కొరతను చూశామని, సర్దుబాటు అలవాటు చేసుకుంటున్నామని చెప్పారు. బీసీసీఐ ఆదేశాల కంటే ముందే ఆటగాళ్ళు అక్కడ సమస్యను అర్థం చేసుకున్నట్టు తెలుస్తోంది.