Today At IPL: :నేడు ఐపీఎల్ లో.. దుమ్ములేపే రెండు మ్యాచ్ లు
ఐపీఎల్ 2022లో భాగంగా నేడు (శనివారం) రెండు మ్యాచ్ లు దుమ్ము లేపనున్నాయి.
- By Hashtag U Published Date - 01:04 PM, Sat - 23 April 22

ఐపీఎల్ 2022లో భాగంగా నేడు (శనివారం) రెండు మ్యాచ్ లు దుమ్ము లేపనున్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి స్థానం కోసం ‘గుజరాత్ టైటాన్స్’ సర్వ శక్తులు ఒడ్డుతుండగా, విజయాల పరంపరను కొనసాగించి తీరాలనే కృత నిశ్చయంతో ‘ సన్ రైజర్స్ హైదరాబాద్’ టీమ్ ఉంది. దూకుడులో ఉన్న గుజరాత్ టైటాన్స్ మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు వరుసగా గత మూడు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. దీంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అది 7వ స్థానానికి పడిపోయింది. మరోవైపు హార్దిక్ పాండ్యా సారధ్యంలోని గుజరాత్ టైటాన్స్ మంచి ఫామ్ లో ఉంది. నాలుగుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించడంతో గుజరాత్ టైటాన్స్ ఆత్మవిశ్వాసం మరింత ఇనుమడించింది.గుజరాత్ టైటాన్స్ చేజారుతుందని భావించిన ఆ మ్యాచ్ ఫలితం .. రషీద్ ఖాన్ మెరుపు బ్యాటింగ్ తో ఒక్కసారిగా మారిపోయింది. కేవలం 21 బంతుల్లో 40 పరుగులు చేసి తన జట్టును రషీద్ ఖాన్ గెలిపించుకున్నాడు.
GT VS KKR …
మొత్తం మీద గుజరాత్ టైటాన్స్ బలం .. దాని కెప్టెన్ హార్దిక్ పాండ్య. ఆయన జట్టుకు అవసరమైన సమయంలో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతుంటారు. డేవిడ్ మిల్లర్, శుబ్ మన్ గిల్ ,మహ్మద్ షమీ , లాకీ ఫెర్గ్యు సన్ లు కూడా పరుగుల వరద పారించగలరు. కోల్ కతా జట్టులో ఉమేష్ యాదవ్ , సునీల్ నారాయణ్ చక్కటి బౌలింగ్ వేయగలరు. కానీ KKR బ్యాటింగ్ యూనిట్ తడబడుతోంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో KKR ఓడిపోయినప్పటికి.. చక్కటి బ్యాటింగ్ తో KKR కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు శుభ సంకేతం.
RCB VS SRH …
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఏ రకంగా చూసిన ఈ రెండు జట్లూ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. RCB గత 7 మ్యాచ్ లలో 5 గెలిచింది.ఈ జట్టు బౌలర్లు జోష్ హాజల్ వుడ్ , హర్షల్ పటేల్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. కీలక సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరవడంలో వీరు నిపుణులు. విరాట్ కోహ్లీతో పాటు ఫాఫ్ దు ప్లెసిస్, దినేష్ కార్తీక్, గ్లేన్ మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఇదే సమయంలో SRH 6 మ్యాచ్ లలో 4 గెలిచింది. ఈ జట్టులోని ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్ లు ఫాస్ట్ బౌలింగ్ తో దడ పుట్టించగలరు. రాహుల్ త్రిపాఠి, కెన్ విలియమ్స్, ఐడెన్ మార్క్రం, నికోలస్ పూరన్ లు SRH బ్యాటింగ్ ఆర్డర్ కు బలంగా నిలుస్తారు.