Brazil out of the World Cup: ఫిఫా వరల్డ్ కప్ నుంచి బ్రెజిల్ ఔట్
- Author : Gopichand
Date : 10-12-2022 - 10:12 IST
Published By : Hashtagu Telugu Desk
సాకర్ ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో సంచలనం నమోదయింది. టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ (Brazil)కు క్రొయేషియా షాక్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో క్రొయేషియా పెనాల్టీ షూట్ అవుట్ లో సాంబా జట్టును నిలువరించి సెమీస్ కు చేరింది. దీంతో 2002 తర్వాత బ్రెజిల్ (Brazil) మరో ప్రపంచకప్ గెలిస్తే చూడాలని ఆశిస్తున్న అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈసారి చక్కటి ప్రదర్శనతో కచ్చితంగా కప్పు గెలిచేలా కనిపించిన సాంబా జట్టు.. క్వార్టర్స్ కూడా దాటలేకపోవడం ఫాన్స్ కు షాక్ గానే చెప్పాలి.
మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లూ గోల్స్ కొట్టలేకపోగా.. అదనపు సమయంలో తలో గోల్ సాధించాయి. బంతిపై ఇరు జట్లూ సమానంగా నియంత్రణ సాధించినా.. మ్యాచ్‌లో గోల్ లక్ష్యంగా ఎక్కువ షాట్లు ఆడింది బ్రెజిలే. నెయ్‌మార్ సహా బ్రెజిల్ ఆటగాళ్లు పలుమార్లు బంతిని నెట్‌లోకి పంపేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. అయితే క్రొయేషియా డిఫెన్స్ చాలా బలంగా నిలబడి బ్రెజిల్‌కు చెక్ పెట్టింది. ఆ జట్టు గోల్ కీపర్ లివకోవిచ్ నిర్ణీత సమయంలోనే కాక.. పెనాల్టీ షూటౌట్లోనూ అదరగొట్టి మ్యాచ్ హీరోగా నిలిచాడు.
తొలి ప్రయత్నంలో వ్లాసిచ్ గోల్ కొట్టి క్రొయేషియాను ఆధిక్యంలో నిలపగా.. రోడ్రిగో విఫలమవడం బ్రెజిల్ ఒత్తిడికి గురయింది. . తర్వాతి రెండు ప్రయత్నాల్లో ఇరు జట్లూ విజయవంతమయ్యాయి. నాలుగో ప్రయత్నంలో ఓర్సిచ్ గోల్ కొట్టి క్రొయేషియాను 4-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లగా.. మార్కినో కొట్టిన షాట్ ఎడమవైపు గోల్ బార్‌ను తాకి బయటికి వచ్చేయడంతో బ్రెజిల్ కథ ముగిసింది. ఫిఫా ప్రపంచకప్ సెమీస్‌లో క్రొయేషియా అడుగుపెట్టడం ఇది మూడో సారి.