Kohli Tips : యువ జట్టుకు కోహ్లీ టిప్స్
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో శనివారం భారత్ యువ జట్టు ఇంగ్లాండ్ తో తలపడబోతోంది.
- By Naresh Kumar Published Date - 12:20 PM, Fri - 4 February 22

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో శనివారం భారత్ యువ జట్టు ఇంగ్లాండ్ తో తలపడబోతోంది. ఈ టోర్నీ ఆరంభమైనప్పటి నుండీ తనదైన ఆధిపత్యం కనబరుస్తోన్న భారత్ మరోసారి టైటిల్ గెలుచుకునేందుకు ఎదురుచూస్తోంది. టోర్నీ చరిత్రలో భారత్ ఎనిమిదోసారి ఫైనల్ చేరుకోగా… వరుసగా నాలుగోసారి తుది పోరుకు అర్హత సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తాజాగా యువ జట్టుకు పలువురు మాజీ క్రికెటర్లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ ఆటగాళ్ళలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించాడు. జూమ్ కాల్ లో అండర్ 19 జట్టుతో మాట్లాడిన కోహ్లీ వారికి పాఠాలు చెప్పాడు. ఫైనల్లో అనుసరించాల్సిన వ్యూహలకు సంబంధించి తన సలహాలు, సూచనలు వారితో పంచుకున్నాడు. కౌలాలంపూర్ వేదికగా 2008లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ లో కోహ్లీ భారత్ ను విజేతగా నిలిపాడు. కోహ్లీనే కాదు రైనా, యువరాజ్ , కైఫ్ , పృథ్వీ షా వంటి చాలా మంది యువ ఆటగాళ్ళు ఈ మెగా టోర్నీతోనే వెలుగులోకి వచ్చారు. అప్పటి తన అనుభవాలను , ఫైనల్ కు ముందు ఉండే ఒత్తిడిని అధిగమించడంలో ఎలా వ్యవహరించాలి వంటి అంశాలపై ప్రస్తుత యువ జట్టుకు సూచనలిచ్చాడు. కాగా కోహ్లీ భాయ్ తో మాట్లాడడం ఎంతో స్ఫూర్తినిచ్చిందని, క్రికెట్ తో పాటు జీవితం గురించి కూడా ఆయన ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయని కెప్టెన్ యశ్ ధూల్ చెప్పాడు. ఇదిలావుంటే.. వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ లో భారత్ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ని విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన యువ భారత్.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాని 96 పరుగుల తేడాతో చిత్తు చేసింది.