BCCI: విరాట్ కోహ్లీ టెస్ట్ విరమణపై బీసీసీఐ స్పందన
టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ ఆకస్మికంగా గుడ్‌బై చెప్పిన అంశంపై బీసీసీఐ చివరికి స్పందించింది. శనివారం ఇంగ్లాండ్ పర్యటనకు భారత టెస్ట్ జట్టును ప్రకటించిన సందర్భంగా సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ మీడియాతో మాట్లాడారు.
- By Kode Mohan Sai Published Date - 03:09 PM, Sat - 24 May 25

BCCI: టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ ఆకస్మికంగా గుడ్‌బై చెప్పిన అంశంపై బీసీసీఐ చివరికి స్పందించింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన కొద్ది రోజులకే కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో శనివారం ఇంగ్లాండ్ పర్యటనకు భారత టెస్ట్ జట్టును ప్రకటించిన సందర్భంగా సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ మీడియాతో మాట్లాడారు. “విరాట్ ఏప్రిల్ మొదట్లోనే మమ్మల్ని సంప్రదించాడు. అప్పటికే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు,” అని అగర్కర్ వెల్లడించారు.
కొహ్లీ, రోహిత్ టెస్ట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో, షుబ్‌మన్ గిల్‌ను భారత కొత్త టెస్ట్ కెప్టెన్‌గా నియమించారు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ఉపకెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. సెలెక్టర్ల నిర్ణయం ఊహించినట్లుగానే జరిగిందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
టెస్ట్ జట్టులోకి తొలిసారి ఎంపికైన బి. సాయి సుధర్షన్‌కు ఇది డెబ్యూ అవకాశమవుతుంది. అలాగే ఏడేళ్ల అనంతరం టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. మరోవైపు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మాత్రం ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
“గత కొన్ని నెలలుగా గిల్‌ను భవిష్యత్ నాయకుడిగా పరిశీలిస్తున్నాం. అతను అద్భుతమైన ఆటగాడు. పెద్ద బాధ్యత కానీ అతనిలో ఈ స్థాయిలో జట్టును ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం,” అని అగర్కర్ చెప్పారు.
షమీ విషయమై మాట్లాడుతూ: “అతని వర్క్‌లోడ్ సరైన స్థాయిలో లేదు. అందుబాటులో ఉంటాడని ఆశించాం కానీ ఫిట్‌నెస్ ఇంకా పూర్తిగా రాలేదు. ఆస్ట్రేలియా పర్యటన జట్టులో ఉన్న హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్ ఈసారి డ్రాప్ అయ్యారు,” అని వివరించారు.
ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టు:
షుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (ఉపకెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, బి. సాయి సుధర్షన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితిష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, షార్దుల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లాండ్ పర్యటన కోసం ఈ జట్టు చాలా సమతులితంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువతకి అవకాశం ఇవ్వడమే కాకుండా అనుభవం కలిగిన ఆటగాళ్లను కూడా జట్టులో నిలుపుకోవడం విశేషం.