Serious Injury Replacement: కొత్త నియమం.. లైక్-ఫర్-లైక్ రీప్లేస్‌మెంట్‌ను అమలు చేయనున్న బీసీసీఐ!
బీసీసీఐ ప్రవేశపెట్టనున్న ఈ కొత్త నియమం ఐసీసీ కంకషన్ సబ్‌స్టిట్యూట్ నియమం మాదిరిగానే ఉంటుంది. దీని ప్రకారం.. ఒక ఆటగాడు తీవ్రమైన గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో తప్పుకుంటే అతని స్థానంలో అదే తరహాలో ఆడే మరో ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంటుంది.
- By Gopichand Published Date - 07:34 PM, Sat - 16 August 25

Serious Injury Replacement: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రికెట్‌లో ఒక విప్లవాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. వచ్చే 2025-26 దేశీయ సీజన్ నుండి రెడ్-బాల్ మ్యాచ్‌లలో కొత్త ‘లైక్-ఫర్-లైక్’ రీప్లేస్‌మెంట్ (Serious Injury Replacement) నియమాన్ని అమలు చేయనుంది. ఈ నియమం ముఖ్యంగా ఆటగాళ్లకు తీవ్రమైన గాయాలు అయినప్పుడు సహాయపడుతుంది. ఇటీవల భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో రిషభ్ పంత్, క్రిస్ వోక్స్ వంటి ఆటగాళ్లు గాయపడటంతో ఈ నియమం అవశ్యకతపై చర్చ మొదలైంది.
కొత్త నియమం వివరాలు
బీసీసీఐ ప్రవేశపెట్టనున్న ఈ కొత్త నియమం ఐసీసీ కంకషన్ సబ్‌స్టిట్యూట్ నియమం మాదిరిగానే ఉంటుంది. దీని ప్రకారం.. ఒక ఆటగాడు తీవ్రమైన గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో తప్పుకుంటే అతని స్థానంలో అదే తరహాలో ఆడే మరో ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మార్పును అమలు చేయడానికి ముందు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
Also Read: T20 Asia Cup: టీ20 ఆసియా కప్.. అత్యధిక సార్లు సున్నాకి ఔటైన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?
లైక్-ఫర్-లైక్ రీప్లేస్‌మెంట్: గాయపడిన ఆటగాడి స్థానంలో అతని నైపుణ్యాలకు సరిపోయే ఆటగాడిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక బ్యాట్స్‌మన్ గాయపడితే అతని స్థానంలో బ్యాట్స్‌మెన్‌ను మాత్రమే రీప్లేస్‌మెంట్‌గా తీసుకోవాలి.
అంపైర్- మ్యాచ్ రిఫరీ ఆమోదం: రీప్లేస్‌మెంట్‌కు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం మ్యాచ్ రిఫరీకి ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు రిఫరీ వైద్య నిపుణులు, ఆన్-ఫీల్డ్ అంపైర్లతో తప్పనిసరిగా సంప్రదించాలి.
ఆటగాళ్ల జాబితా: రీప్లేస్‌మెంట్‌గా వచ్చే ఆటగాడి పేరు టాస్‌కు ముందు సమర్పించిన ఆటగాళ్ల జాబితాలో ఉండాలి. ఒకవేళ జట్టులో రిజర్వ్ వికెట్ కీపర్ లేకపోతే వికెట్ కీపర్ రీప్లేస్‌మెంట్‌గా జాబితా వెలుపల ఉన్న ఆటగాడిని కూడా తీసుకోవచ్చు.
వైట్-బాల్ క్రికెట్‌కు వర్తించదు
ప్రస్తుతానికి ఈ కొత్త నియమం రెడ్-బాల్ (టెస్ట్) ఫార్మాట్‌కు మాత్రమే వర్తిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ వంటి వైట్-బాల్ టోర్నమెంట్లలో ఈ నియమం అమలు చేయబడదు. అయితే అండర్-19 సీకే నాయుడు ట్రోఫీలో ఇది అమలులోకి వస్తుంది. ఐపీఎల్ 2026 కోసం ఈ నియమాన్ని ప్రవేశపెడతారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కొత్త నియమం అమలుతో ఆటగాళ్ల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, మ్యాచ్ మధ్యలో గాయాల కారణంగా జట్టు సమతూకం దెబ్బతినకుండా ఉంటుంది.