FIFA World Cup: క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా
ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్ళింది.
- By Naresh Kumar Published Date - 04:20 PM, Sun - 4 December 22

ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. నాకౌట్ పోరులో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. గత మ్యాచ్‌లో గోల్ చేయడంలో విఫలమైన మెస్సీ ఈ మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టాడు. ఆట 35వ నిమిషంలో లెఫ్ట్ కార్నర్ నుంచి గోల్ కొట్టడంతో అర్జెంటీనా బోణీ చేసింది. ఆ తర్వాత తొలి అర్థభాగం ముగిసేసరికి అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
సెకండాఫ్ లో ఆస్ట్రేలియా గోల్ కీపర్ మాథ్‌యూ రేయాన్‌ను బోల్తా కొట్టిస్తూ సింపుల్ గోల్ చేయడంతో అర్జెంటీనా ఆధిక్యం 2-0కు పెరిగింది. ఆ తర్వాత ఆట 77వ నిమిషంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఫెర్నాండేజ్ సెల్ఫ్‌గోల్ చేయడంతో ఆధిక్యం 2-1కి తగ్గింది. చివర్లో ఒకరి గోల్ పోస్టుపై మరొకరు దాడులు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. మెస్సీ మరో గోల్ చేసేందుకు చివరి వరకూ ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయాడు.
చివరకు అర్జెంటీనా 2-1తో విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. డిసెంబర్ 10న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో అర్జెంటీనా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. మరో మ్యాచ్ లో నెదర్లాండ్స్ 3–1 గోల్స్ తేడాతో అమెరికాపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. నెదర్లాండ్స్ ఆటగాడు డెంజెల్ డంఫ్రైస్ అదరగొట్టాడు. తొలి రెండు గోల్స్‌కు మెరుపు పాస్‌లు అందించిన డెంజెల్… ఆట చివర్లో గోల్ చేసి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.