IPL 2023 : రాయల్‌గా రాజస్థాన్ విక్టరీ.. సొంతగడ్డపై సన్ రైజర్స్ ఫ్లాఫ్ షో..!!
- By hashtagu Published Date - 07:29 PM, Sun - 2 April 23
గత ఏడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 16వ (IPL 2023) సీజన్ ను గ్రాండ్ విక్టరీతో మొదలుపెట్టింది. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ను 72 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టర్ ఫ్లాపైంది. అటు బౌలింగ్..ఇటు బ్యాటింగ్ ఎందులోనూ స్థాయికి తగిన ఆటతీరు కనబరచలేకపోయింది. మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ భారీస్కోర్ సాధించింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ , జాస్ బట్లర్ , సంజూ శాంసన్ దంచికొట్టారు. పవర్ ప్లేలో హైదరాబాద్ బౌలర్లకు ఈ ముగ్గురూ చుక్కలు చూపించారు. ముఖ్యంగా బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారీ షాట్లతో చెలరేగిన బట్లర్ కేవలం 22 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు.
జైశ్వాల్ , బట్లర్ తొలి వికెట్ కు కేవలం 5.5 ఓవర్లలోనే 85 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడుతున్న బట్లర్‌ను బౌల్డ్ చేసి ఫరూఖి హైదరాబాద్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు .తర్వాత సంజూ శాంసన్ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియాలో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్న సంజూ ఈ సీజన్ ను హాఫ్ సెంచరీతో ఆరంభించాడు. కాన్ఫిడెంట్ గా కనిపించిన ఈ కేరళ యువక్రికెటర్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. ఒక దశలో రాజస్థాన్ 220కి పైగా స్కోర్ చేస్తుందనుకున్నారు. అయితే చివర్లో పుంజుకున్న సన్ రైజర్స్ బౌలర్లు రాజస్థాన్ జోరుకు కళ్ళెం వేశారు. దీంతో రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఆఫ్ఘనిస్థాన్ పేసర్ ఫరూఖీ 2 , నటరాజన్ 2 , ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
ఛేజింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు తొలి ఓవర్ లోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టి దెబ్బకొట్టాడు. అభిషేక్ శర్మతో పాటు రాహుల్ త్రిపాఠీని డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. దీంతో సన్ రైజర్స్ ఖాతా కూడా తెరవకుండానే 2 వికెట్లు కోల్పోయింది. 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ కూడా అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయాడు. తొలిసారి భారత్ పిచ్ లపై ఆడుతుండడంతో అంత సౌకర్యవంతంగా కనిపించలేదు. కేవలం ఒకే ఒక ఫోర్ కొట్టిన బ్రూక్ 21 బంతుల్లో కేవలం 13 పరుగులకే ఔటయ్యాడు. మిగిలిన బ్యాటర్లలో ఎవ్వరూ పెద్దగా రాణించలేదు.
ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అబ్దుల్ సమద్ ఆరంభంలో నిదానంగా ఆడాడు. చివర్లో భారీ షాట్లు కొట్టినా స్కోర్ 130 దాటేందుకే ఉపయోగపడింది. రాజస్థాన్ బౌలర్లు అందరూ అద్భుతంగా బౌలింగ్ చేసారు. సన్ రైజర్స్ బ్యాటర్లకు భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వలేదు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికే రాజస్థాన్ విజయం ఖాయమైపోయింది. అబ్దుల్ సమద్ 32 , ఉమ్రాన్ మాలిక్ 8 బంతుల్లో 19 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4 , బౌల్ట్ 2 , అశ్విన్, హోల్డర్ తలో వికెట్ పడగొట్టారు. మొత్తం మీద ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ విఫలమైందనే చెప్పాలి. బౌలర్లు పేలవ ప్రదర్శన కనబరిస్తే.. వారికి పోటీగా బ్యాటర్లు కూడా నిరాశపరిచారు. బౌలర్లలో నటరాజన్ , ఆదిల్ రషీద్ తప్పిస్తే… మిగిలిన వారంతా ఓవర్ కు 10కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి మ్యాచ్ లో ఏప్రిల్ 7న లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది.
Related News
Kohli On Impact Player: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై విరాట్ కోహ్లీ అభిప్రాయం ఇదే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చివరి సీజన్ నుండి ఇన్నింగ్స్ మధ్యలో ప్రత్యామ్నాయ ఆటగాడి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రారంభమైంది.