Afghanistan : శభాష్ ఆఫ్ఘనిస్తాన్.. ఓడే మ్యాచ్‌లో గెలిచి సెమీస్ బెర్త్ కైవసం
టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది.
- Author : Pasha
Date : 25-06-2024 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
Afghanistan : టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. పెద్ద జట్టు ఆసీస్ కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పై తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో అదరగొట్టింది. అద్భుతమైన బౌలింగ్ తో ఓడిపోయే మ్యాచ్ గెలిచి సెమీఫైనల్ కు దూసుకెళ్ళింది. ఊహించినట్టుగానే ఆఫ్ఘన్(Afghanistan), బంగ్లా మ్యాచ్ రసవత్తరంగా సాగింది.
We’re now on WhatsApp. Click to Join
మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ను బంగ్లా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ ను 115 పరుగులకే పరిమితం చేశారు. గుర్బాజ్ ఒక్కడే 43 పరుగులతో రాణించాడు. చివర్లో కెప్టెన్ రషీద్ ఖాన్ 3 సిక్సర్లు కొట్టడంతో స్కోర్ 100 దాటగలిగింది. బంగ్లా బౌలర్లు ఏకంగా 66 డాట్ బాల్స్ వేశారు. టీ ట్వంటీల్లో ఇదో రికార్డ్. కాగా సెమీస్ చేరాలంటే 116 పరుగుల టార్గెట్ ను బంగ్లాదేశ్ 12.1 ఓవర్లలో ఛేదించాలి. దీనికి తగ్గట్టుగానే ఆ జట్టు ఓపెనర్లు దూకుడుగా ఆడారు. మధ్యలో వర్షం అంతరాయం కలిగించినా బంగ్లా ధాటిగా ఆడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. మధ్యలో ఆఫ్ఘన్ బౌలర్లు పుంజుకోవడం, బంగ్లా వరుస వికెట్లు కోల్పోవడంతో టెన్షన్ తారాస్థాయికి చేరింది.
Also Read :MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతాను : జీవన్‌రెడ్డి
అయితే ఓపెనర్ లిట్టన్ దాస్ క్రీజులో ఉండడంతో ఆసీస్ ఆశలు నిలిచాయి. మరోవైపు ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తన స్పిన్ మ్యాజిక్ తో కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. విజయం కోసం బంగ్లాదేశ్ 50 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో టార్గెట్ ను 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్ణయించారు. ఇక్కడ నుంచి ఆఫ్గన్ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీశారు. లిట్టన్ దాస్ క్రీజులో ఉన్నా మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. ఆఫ్గనిస్తాన్ గెలుపుతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది.