Odisha Train Accident: తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి… రైలు ప్రమాదంలో హృదయవిదారక ఘటన
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదం దేశాన్ని కన్నీళ్లుపెట్టిస్తుంది. ఈ రైలు ప్రమాదం మునుపెన్నడూ చూడని విషాదంగా చెప్తున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 03-06-2023 - 4:25 IST
Published By : Hashtagu Telugu Desk
Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదం దేశాన్ని కన్నీళ్లుపెట్టిస్తుంది. ఈ రైలు ప్రమాదం మునుపెన్నడూ చూడని విషాదంగా చెప్తున్నారు. ఎన్నో ఆశలతో ప్రయాణిస్తున్న వారి జీవితాలు నిద్రలో ముగిశాయి. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు వందలకు పైగా మరణాలు సంభవించాయి. ఆసుపత్రుల వెలుపల ప్రజల రోదనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. చెమ్మగిల్లిన కళ్లను ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాల రోదనలను చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇక క్షతగాత్రుల వివరాలు తెలియక కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం.
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. కానీ ఇప్పుడు ప్రజలు తమ ఆత్మీయుల క్షేమం గురించి వెతుకులాట ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఓ వ్యక్తి తన సోదరుడి కోసం ఒక ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి తిరుగుతూ కనిపిస్తున్నాడు. దాని వెనుక జరిగిన కథ అత్యంత విషాదమనే చెప్పాలి.
తల్లి అంత్యక్రియల కోసం 14 ఏళ్ల తర్వాత చెన్నై నుంచి ఓ కొడుకు తన గ్రామానికి వచ్చాడు. శ్రద్ధకర్మ తర్వాత అతను తిరిగి బయలుదేరాడు. కానీ రైలు ప్రమాదానికి గురి కావడంతో ఆ వ్యక్తి తల్లి ఒడికి చేరిపోయాడు. బాలాసోర్ జిల్లా సోరో ప్రాంతానికి చెందిన రమేష్ చెన్నైలో నివసిస్తున్నారు. ఇటీవల తల్లి మరణించడంతో రమేష్ 14 ఏళ్ల తర్వాత గ్రామానికి వచ్చాడు. తల్లి శుద్ధి కర్మలు ముగించుకుని శుక్రవారం చెన్నైకి తిరిగి బయలుదేరాడు. అయితే దేవుడు మరో రాత రాశాడు. ఈ ప్రమాదంలో రమేష్ మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తించేందుకు రమేష్ సోదరులిద్దరూ ఆస్పత్రి నుంచి ఆస్పత్రికి తిరుగుతూ వెతుకుతున్నారు. ఇప్పటికీ సోదరుడి మృతదేహం దొరకకపోవడంతో ఆ సోదరుల బాధ ప్రతి ఒక్కరిని కన్నీరుపెట్టిస్తుంది.
Odisha train tragedy: Youth had come home after 14 years for mother’s final rites, feared dead#OdishaTrainTragedy #TrainAccident #Odishahttps://t.co/ZxIRLZtLCK
— OTV (@otvnews) June 3, 2023
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు రమేష్ రైలు ఎక్కాడని సోదరుడు చెప్పాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగడంతో ఘటనాస్థలికి చేరుకున్నామని, తమ్ముడి కోసం ఎంత వెతికినా దొరకలేదని వాపోయారు. అర్ధరాత్రి 12.30 గంటలకు మేము అతని మొబైల్ ఫోన్‌కు కాల్ చేయగా.. ఒక వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి రమేష్ చనిపోయాడని చెప్పినట్టు సోదరుడు చెప్తున్నాడు.అయితే తమ సోదరుడి మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదని బాధపడుతున్నారు.
Read More: Odisha Train Tragedy: 21 శతాబ్దంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఇది: సీఎం మమతా