Tiger Died: విద్యుత్ కంచె తగిలి పులి మృతి.. వండుకుని తినేసిన వైనం!
- Author : Balu J
Date : 20-02-2023 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
విద్యుత్ కంచెకు తగిలి మరణించిన పులిని కొందరు కలిసి గుట్టుచప్పుడు కాకుండా వండుకుని తినేశారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది ఆడపులి పాదముద్రలను గుర్తించారు. దీంతో పులి ఆచూకీని తెలుసుకునేందుకు అదే రోజు ట్రాప్ కెమెరాలు అమర్చారు. పులి సంచారం గురించి సమీప ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తూ ఆరుబయట ఎవరూ నిద్రపోవద్దని హెచ్చరికలు జారీ చేస్తూ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన కంచె తగిలి పులి మరణించింది. గమనించిన కొందరు పులి మాంసాన్ని వండుకుని తినేసినట్టు ప్రచారం జరుగుతోంది. పులిగోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య తేడాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పులి మాంసాన్ని వండుకున్న వారంతా దాని చర్మాన్ని సమీపంలోని బావిలో పడేసినట్టు అనుమానిస్తున్నారు. పులి మాంసాన్ని వండుకుని తిన్నట్టుగా భావిస్తున్న 12 మందిని గుర్తించినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం వీరిలో ఇద్దరిని ఎర్రగొండపాలెంలోని కార్యాలయానికి పిలిపించి రహస్యంగా విచారించినట్టు తెలుస్తోంది. కాగా, తల్లి కోసం రెండు పులి కూనలు వెతుకుతుండడం ట్రాప్ కెమెరాల్లో రికార్డయింది.