TTD: ఫలితాలిస్తున్న ‘ప్లాస్టిక్’ నిషేధం!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ నిషేధంపై ఉక్కుపాదం మోపింది.
- By Balu J Published Date - 11:29 AM, Thu - 2 June 22

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ నిషేధంపై ఉక్కుపాదం మోపింది. జూన్ 1 నుంచి తిరుమలలో అన్ని రకాల ప్లాస్టిక్‌లను నిషేధిస్తున్నట్టు తేల్చి చెప్పింది. తిరుమలలోని దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో నుంచి సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు టీటీడీ అధికారి మల్లికార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. ప్లాస్టిక్, సీసాలు, సంచులు షాంపూ సాచెట్‌లతో సహా ఈ నిషేధం వర్తిస్తుంది.
నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి టిటిడికి సహకరించాలని దుకాణాల యజమానులను కోరిన మల్లికార్జున, అలిపిరిలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే భక్తులను తిరుమలకు అనుమతిస్తామని అన్నారు. ఇతర వస్తువులతో పాటు బట్టలు మరియు బొమ్మలను ప్యాకింగ్ చేయడానికి బయోడిగ్రేడబుల్ బ్యాగ్‌లను ఉపయోగించాలని వ్యాపార యజమానులకు సూచించారు. ఈ మేరకు బుధ, గురువారాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపట్టారు. కాలినడకన, వాహనాల్లో వస్తున్న భక్తులను అలిపిరి వద్ద తనిఖీ చేసి ప్లాస్టిక్ సీసాలు, కవర్లను స్వాధీనం చేసుకొని పంపించారు. ఇటు అధికారులు, అటు టీటీడీ ఉద్యోగులు ప్లాస్టిక్ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటుండటంతో గుట్టలుగుట్టలుగా ప్లాస్టిక్ లభిస్తోంది. ఇలాగే కఠిన చర్యలు తీసుకుంటే తిరుమల తిరుపతి ప్లాస్టిక్ రహిత సిటీగా మారక తప్పదని భక్తులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.