TGSRTC : తొలి మహిళా కండక్టర్లను సన్మానించిన టీజీఎస్ ఆర్టీసీ
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ ఆర్టీసీ) మహిళా సాధికారతకు మరొక అడుగుగా చారిత్రక ఘట్టాన్ని గుర్తుగా నిలిపింది.
- By Kavya Krishna Published Date - 06:05 PM, Wed - 18 June 25

TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ ఆర్టీసీ) మహిళా సాధికారతకు మరొక అడుగుగా చారిత్రక ఘట్టాన్ని గుర్తుగా నిలిపింది. ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా సేవలను ప్రారంభించి, దాదాపు మూడు దశాబ్దాల పాటు విశేషమైన సేవలందించిన ముగ్గురు మహిళా కండక్టర్లను సంస్థ ఘనంగా సన్మానించింది. హైదరాబాద్ బస్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన శ్రీదేవి, అనిత, మెహదీపట్నం డిపోకు చెందిన శారదలను టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ సత్కరించారు. సంస్థలో 28 ఏళ్ల పాటు నిష్ఠగా, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సేవలందించిన ఈ ముగ్గురు మహిళలను సంస్థ యాజమాన్యం ప్రశంసించింది. వారికీ ప్రశంసాపత్రాలను అందజేస్తూ సజ్జనర్ ప్రశంసలు కురిపించారు.
Maharashtra : అంత్యక్రియలు మొదలుపెట్టగానే లేచి కూర్చున్న శవం
ఈ సందర్భంగా ఆయన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ, మహిళా సిబ్బందికి ప్రోత్సాహం కలిగించేలా ఇదొక పాఠంగా నిలుస్తుందని అన్నారు. వారి అంకితభావం, పట్టుదల ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. ఇటీవల న్యూఢిల్లీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్ (ASRTU) కూడా వీరిని ప్రత్యేకంగా సత్కరించిన విషయం తెలిసిందే. టీజీఎస్ ఆర్టీసీ తరఫున మహిళా కండక్టర్లు శ్రీదేవి, అనిత, శారద లు పాల్గొని అక్కడ గౌరవం పొందారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, సీపీఎం ఉషాదేవి, దిల్‌సుఖ్‌నగర్ డిపో మేనేజర్ సమత తదితరులు పాల్గొన్నారు. మహిళల పాత్రను గౌరవించేలా ఈ కార్యక్రమం కొనసాగడం పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Sattenapalle : బారికేడ్లను నెట్టివేస్తూ పోలీసులతో గొడవకు దిగిన అంబటి