Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు..!
- Author : HashtagU Desk
Date : 30-03-2022 - 9:57 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, అనంతపురంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక చిత్తూరులో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత, జమ్మలమడుగులో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత, తిరుపతిలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక విజయవాడలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత, విశాఖపట్నంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రత, ఒంగోలులో 36.8 డిగ్రీల ఉష్ణోగ్రత, గుంటూరులో 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత, నెల్లూరులో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత, విజయనగరంలో 36.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో మార్చి నెలలోనే ఎండలు ఓ రేంజ్‌లో మండిపోతుంటే, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఊహించడానికి కూడా భయపడుతున్నారు ప్రజలు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఎండలకు భయపడి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇంటి నుంచి ఎవరూ కాలు బయటపెట్టట్లేదు. ఇక మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లేవారు సైతం ఎండలకు భయపడి, ఉదయం 11 గంటలు లోపు పనులు చక్కబెట్టుకుని ఇళ్లకు చేరుతున్నారు. మరీ అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లట్లేదు. పశ్చిమ వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడిమితో పాటు పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.