AP CS : డ్యూటీకి రాని డాక్టర్లపై చర్యలు తీసుకోండి.. ఆరోగ్యశాఖకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశం
చాలా కాలంగా విధులకు హాజరుకాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులను
- Author : Prasad
Date : 09-08-2023 - 8:36 IST
Published By : Hashtagu Telugu Desk
చాలా కాలంగా విధులకు హాజరుకాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పలు ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వైద్యం అందించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న తరుణంలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు లేకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా 30 రోజులకు పైగా విధులకు గైర్హాజరైన వైద్యులను గుర్తించి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. చాలా కాలంగా విధులకు గైర్హాజరైన వైద్యులను గుర్తించామని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. వారికి నోటీసులు అందజేశామని, వారంలోగా విధులకు హాజరుకాని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా రానున్న ఐదు వైద్య కళాశాలల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.