IPL 2022: చెన్నై కెప్టెన్సీ రేసులో ఉన్నది వాళ్ళే
ఐపీఎల్‌లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి కెప్టెన్ ను మార్చని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. తొలి సీజన్ నుంచీ ఇప్పటి వరకూ మహేంద్ర సింగ్ ధోనీనే సారథిగా ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ..
- By Naresh Kumar Published Date - 11:13 AM, Thu - 24 March 22

ఐపీఎల్‌లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి కెప్టెన్ ను మార్చని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. తొలి సీజన్ నుంచీ ఇప్పటి వరకూ మహేంద్ర సింగ్ ధోనీనే సారథిగా ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. త్వరలో ఐపీఎల్‌కి కూడా ధోనీ గుడ్‌బై చెప్పనున్నాడని వార్తలు వస్తున్నాయి. దీంతో ధోని తర్వాత చెన్నై కెప్టెన్ గా ఎవరు ఉంటారనే దానిపై చర్చ జరుగుతోంది. గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన సురేశ్ రైనా.. ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ స్థానంలో కెప్టెన్ గా పలువురుకి అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు.
రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, డ్వేన్ బ్రావో రాబోయే కాలంలో జట్టుకు కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉందన్నాడు. వారందరూ సమర్థులనీ, ఆటను బాగా అర్థం చేసుకుంటారనీ రైనా చెప్పుకొచ్చాడు. వచ్చే సీజన్‌లో ఈ ఆటగాళ్లలో ఎవరైనా ధోనీ స్థానాన్ని భర్తీ చేయగలరన్నాడు. ఆటపై వారికి ఉన్న అవగాహన జట్టుకు ఎప్పుడూ ఉపయోగ పడుతుందన్నాడు.
అయితే ధోనీ వారసునిగా జడేజా వైపే చెన్నై యాజమాన్యం మొగ్గు చూప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ ముగిసిన తర్వాత ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్ , చెన్నై తర్వాతి కెప్టెన్ ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2022 సీజన్ కోసం అందరి కన్నా ముందే చెన్నై ప్రాక్టీస్ మొదలుపెట్టింది. లీగ్ మొత్తం ముంబై, పుణేల్లో జరగనున్న నేపథ్యంలో అదే తరహా మైదానం ఉండే సూరత్‌లో చెన్నై శిక్షణా శిభిరం ఏర్పాటు చేసింది. సీజన్ ఆరంభ మ్యాచ్ లో మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ తో తలపడనుంది.