SL Beat India: లంక చేతిలోనూ భారత్ ఓటమి
ఆసియా కప్ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ చేతులెత్తేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది.
- By Naresh Kumar Published Date - 11:22 PM, Tue - 6 September 22

ఆసియా కప్ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ చేతులెత్తేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది.
మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది.కేఎల్ రాహుల్, కోహ్లిలు తొందరగా ఔటయ్యారు. ఈ దశలో రోహిత్, సూర్యకుమార్‌లు టీమిండియా ఇన్నింగ్స్‌ను నడిపించారు. మూడో వికెట్‌కు ఇద్దరి మధ్య 96 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.
మునుపటి రోహిత్ ను గుర్తు చేస్తూ ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. అయితే రోహిత్, సూర్యకుమార్‌లు ఔటైన తర్వాత వచ్చిన మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీనిక తోడూ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 200 పరుగుల స్కోరు దాటుతుందనుకుంటే 173 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ 72 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు చేశాడు.
శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషనక 3, దాసున్ షనక, చమిక కరుణరత్నే చెరో రెండు వికెట్లు, మహిష్ తీక్షణ ఒక వికెట్ తీశాడు.174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలింగ్ పై పూర్తి ఆధిపత్యం కనబరిచారు.
నిసాంక , కుషాల్ మెండిస్ ధాటిగా ఆడడంతో తొలి వికెట్ కు 11.1 ఓవర్లలో 97 పరుగులు జోడించారు. అయితే వీరి పార్టనర్ షిప్ ను చాహాల్ విడదీశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. కాసేపటికే లంక మరో రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే చివరి ఆరు ఓవర్లలో భారత్ పోరాడినా…కీలక సమయంలో పట్టు కోల్పోయింది. గత మ్యాచ్ తరహాలోనే 19వ ఓవర్లో భువనేశ్వర్ 14 రన్స్ ఇవ్వడం ఓటమికి కారణమయింది. చివరి ఓవర్లో ఏడు రన్స్ చేయాల్సి ఉండగా అర్ష దీప్ సింగ్ బాగానే బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో భారత్ ఫైనల్ రేస్ నుంచి దాదాపుగా తప్పుకోగా…లంక ఫైనల్ కు చేరువైంది.